న్యూఢిల్లీ : కీలక సరిహద్దు రాష్ట్రమైన జమ్ము కశ్మీర్ పై కేంద్రం భారీ కసరత్తు చేస్తోంది. కేవలం 370, 35ఏ అధికరణ రద్దుతోనే కశ్మీర్ లోయలో పరిస్థితులు చక్కబడవని కాస్త ఆలస్యంగానే గ్రహించింది. రాష్ట్రాన్ని
కేవలం బలగాలతోనే నడిపించలేమన్న చేదు నిజాన్ని గుర్తించింది. తన ప్రయత్నాలకు బలగాలు సహాయకారిగా ఉంటాయి తప్ప, వాటితోనే పరిస్థితిని నియంత్రిచలేమన్న విషయాన్ని గ్రహించింది.
రాష్ట్రాన్ని ప్రగతి పధాన ప్రయాణింప చేయడం ద్వారా మాత్రమే ప్రజల మనసులను చూరగొనగలమని, శాంతి భధ్రతలను కాపాడగలమని ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా వివిధ
అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనుంది. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై దృష్టి సారించింది. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే కశ్మీర్ నిజంగా భూతల స్వర్గంగా
మారుతుందనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం ఉండనక్కర్లేదు. మిగతా 27 రాష్ట్రాలతో పోటీ పడగలదు. యావత్ భారతావని కూడా ఇదే కోరుకుంటోంది.కశ్మీర్ లో కేంద్రం చేపట్టనున్న బహుముఖ
కార్యాచరణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో అత్యంత కీలకమైనది పన్నుల విరామం దీని ద్వారా పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముంచుకువస్తారని అంచనా వేస్తోంది.
జిఎస్టీతో సహా అన్ని రకాల పన్నులకు మినహాయింపు ఇవ్వాలన్నది కేంద్రం ఆలోచనగా చెబుతున్నారు. ఇందుకోసం 11 కేంద్ర మంత్రిత్వ శాఖల ద్వారా దీర్ఘ కాలిక కార్యచరణ ప్రణాళిక
రూపొందించారు. ప్రతి గ్రామంలో అయిదుగురు యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్నది లక్ష్యం. రాష్ట్రం నుంచి విడదీసి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన లడఖ్ కు ప్రత్యేక ప్యాకేజీని
ప్రకటించనుంది. స్థానిక యువకులతో ప్రత్యేక సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, బెటాలియన్లను ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు కొత్త జీతభత్యాలను అమలు
చేయనున్నారు. ఈ నిర్ణయం ద్వారా ఉద్యోగులను సంతృప్తి పర్చ వచ్చన్నది ప్రభుత్వ అంచనా. ప్రత్యేక బెటాలియన్ల ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. శాంతిభద్రతల
పరిరక్షణలో వారిని భాగస్వాములను చేసినట్లు అవుతుంది.శాంతిభద్రతలకు సంబంధించి బయటి నుంచి బలగాలను రప్పించడం కన్నా స్థానిక బలగాలను వినియోగించడం ఏ రకంగా చూసినా మంచి
నిర్ణయమే. మూడు నుంచి అయిదు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కొంతవరకైనా లభిస్తాయి. అంతేకాక ఆయా
ప్రాంతాల అభివృద్ధి చెందుతాయి. కార్పోరేటు ఆసుపత్రులు, విద్యాసంస్థల ఏర్పాటు ద్వారా ప్రజల్లో సానుకూల భావనలు కల్పించవచ్చన్నది కేంద్రం ఆలోచన. వీటి ఏర్పాటువల్ల మెరుగైన విద్య,
వైద్యసేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటి సంస్థలు అతి తక్కువగా ఉన్నాయి. యూపీఏ హయాంలో తీసుకువచ్చిన విద్యాహక్కు చట్టం రాష్ట్రంలో అమలు కావడం
లేదు. దీన్ని అమలు చేయాలని కేంద్రం తలపిస్తోంది. దీని ద్వారా 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచితంగా విద్య అందించేందుకు అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం పిల్లలు, యువకులు వేర్పాటు
వాదుల వైపు ఆకర్షితులవుతున్నారు. ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. రాళ్లు రువ్వడం వంటి కార్యకలాపాల ఫలితంగా జైలు పాలై విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు. ఏళ్ల తరబడి జైళ్లలోనే మగ్గాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.విద్యుత్ ఛార్జీలను తగ్గించడం ద్వారా కాశ్మీర్ లో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారని కేంద్రం అంచనా వేస్తోంది. తీవ్ర వాదం కారణంగా రాష్ట్రానికి
రావాలంటేనే పారిశ్రామిక వేత్తలు సంకోచిస్తున్నారు. పెట్టుబడి దారుల సదస్సులు నిర్వహించడం ద్వారా పరిశ్రమల స్థాపనకు అవసరమైన సానుకూల వాతావరణాన్ని సృష్టించవచ్చన్న ఆలోచనను
కేంద్రం చేస్తోంది. లడఖ్ లో సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహం కల్పించనున్నారు. సాహస, ఆద్యాత్మిక, పర్యాటక ప్యాకేజీల ద్వారా గణనీయంగా ఆదాయం సమకూరుతుంది. పుణ్యక్షేత్రమైన అమర్
నాథ్, కాట్ర యాత్రల ద్వారా భక్తులను ఆకట్టుకోవచ్చు. రాజధాని శ్రీనగర్ లోని దాల్ సరస్సు, చారిత్రాత్మక లాల్ చౌక్ , భారత్ – పాక్ ల మద్యగల ఎల్.ఓ.సి సందర్శనకు వివిధ రాష్ట్రాల నుంచి
ప్రజలు పెద్ద ఎత్తున వస్తుంటారు. కేంద్రం ఆలోచనలు కావ్యరూపం అమలయితే కశ్మీర్ ముఖచిత్రం మారిపోతుంది.