నర్సరావు పేటలో కోడెల వారసులు ఎవరు...
గుంటూరు,
నాలుగు రోజుల కిందట ఆత్మహత్యకు పాల్పడిన ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబం రాజకీయ ప్రస్థానం దాదాపు ముగిసినట్లే. ఆయన రాజకీయ వారసులకు ఎదిగే పరిస్థితి లేకుండా పోయిందా? వ్యూహాత్మక రాజకీయాల్లో కోడెల శివప్రసాద్ శైలిని అనుసరించే నాయకుడు కానీ, అందిపుచ్చుకునే కుటుంబ సభ్యుడు కానీ ఇక లేనట్టేనా? ఇప్పుడు ఈ ప్రశ్నలే తెరమీదికి వస్తున్నాయి. దివంగత కోడెల శివప్రసాద్ గుంటూరు జిల్లాలోని రెండు ప్రధాన నియోజకవర్గాల్లో తన సత్తా చాటుకున్నారు. నరసరావుపేట నుంచి వరుసగా ఐదు సార్లు గెలుపు గుర్రం ఎక్కారు. దీంతో ఈ నియోజకవర్గాన్ని తన మానస పుత్రికగా చేసుకుని అభివృద్ధి చేశారు.తన మాటకు, తనకు కూడా ఎదురు లేకుండా చేసుకున్నారు కోడెల శివప్రసాద్. అనేకానేక అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతోకోడెల శివప్రసాద్ పేరు ఇక్కడ చిరస్థాయిగా నిలిచిపోయింది. అయితే, గత 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇక్కడ టికెట్‌ను బీజేపీతో పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. దీంతో ఆ ఎన్నికల సమయంలో కోడెల శివప్రసాద్ సత్తెనపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన అటు నరసరావుపేట సహా సత్తె నపల్లిని తన మానసు పుత్రికలుగా చేసుకుని అభివృద్ధి చేశారు. ఇక ఇటీవలి ఎన్నికల్లో కోడెల శివప్రసాద్ సత్తెనపల్లి నుంచే పోటీ చేసి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఓడిపోయారు.సరే! ఇప్పుడు ఆయన లేరు కాబట్టి.. ఈ రెండు స్థానాల పరిస్థితి ఏంటి? సత్తెనపల్లి ప్రస్తుత ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించినట్టు.. ఈ రెండు స్థానాలను కోడెల వారసుడు, వారసురాలికి కేటాయించే సత్తా టీడీపీలో ఉందా? అనే చర్చ నడుస్తోంది. నిజానికి ఈ తరహా సత్తా కోడెల శివప్రసాద్ వారసుల్లో పెద్దగా లేక పోవడం గమనార్హం. కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మిలు ఇప్పటికే అనేక కేసుల్లో ఉండడం వారిపై రెండు నియోజకవర్గాల ప్రజల్లోనూ సరైన అభిప్రాయం లేకపోవడం వంటివి ఇప్పుడు చర్చకు వస్తున్న ప్రధాన విషయాలు.ఇదిలావుంటే, మరోపక్క, పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే తాజాగా ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో కోడెల శివప్రసాద్ కోరినప్పటికీ.. ఆయన కుమారుడికి నరసారావుపేట టికెట్ ఇవ్వకుండా బీసీ నేత చదలవాడ అరవిందబాబుకు కేటాయించారు. కేవలం సత్తెనపల్లికి మాత్రమే కోడెల శివప్రసాద్ ను పరిమితం చేశారు. మరోపక్క, ఇక్కడ కూడా కోడెల శివప్రసాద్ ఓడిపోవడంతో ఈ స్థానాన్ని పార్టీ మారుస్తుందని ప్రచారం చేస్తున్న సీనియర్ పొలిటిషీయన్ రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావుకు అప్పగించాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల చంద్రబాబు పిలుపు మేరకు ఆత్మకూరు నిరసనలో కోడెల శివప్రసాద్ వర్గం, రాయపాటి వర్గాలు ఇక్కడ తన్నుకున్నాయి.ఇక ఎన్నికలకు ముందు నుంచే సత్తెనపల్లిపై పట్టుకోసం రాయపాటి వర్గం తీవ్రంగా ప్రయత్నించింది. ఇక ఇప్పుడు కోడెల శివప్రసాద్ కూడా లేకపోవడంతో సత్తెనపల్లి టీడీపీ పగ్గాలు రాయాపాటి రంగారావుకు అప్పగించవచ్చు. ఇక నరసారావుపేటలో బీసీ కార్డుతో చదలవాడ అరవిందబాబునే కంటిన్యూ చేస్తారా ? లేదా ? అక్కడ బలంగా ఉన్న వైసీపీని ఢీ కొట్టేందుకు రెడ్డి సామాజికవర్గాన్ని రంగంలోకి దించుతారా ? అన్నది చూడాలి. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే.. కోడెల శివప్రసాద్ వారసులకు పెద్దగా ప్రాధాన్యం లేదనే అంటున్నారుపరిశీలకులు.