ఉప ఎన్నికలతో జేడీఎస్ కు మళ్లీ ఆశలు
బెంగళూర్,
కర్ణాటకలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. అంతా సజావుగా జరిగి అనుకున్నట్లు ఫలితాలు వస్తే తిరిగి సంకీర్ణ సర్కార్ కొలువుదీరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పదిహేడు మంది శాసనసభ్యుల అసమ్మతితో ఇటీవల కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికలు జరిగే 15 నియోజకవర్గాలన్నీ కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ లకు చెందిన సిట్టింగ్ స్థానాలే. పార్టీని వారు వదలి వెళ్లిపోవడంతో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి.గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ లు విడివిడిగా పోటీ చేశాయి. ఎవరికీ పూర్తి స్థాయి మెజారిటీ రాకపోవడంతో జేడీఎస్,కాంగ్రెస్ ఎన్నికల అనంతరం పొత్తు పెట్టుకుని అధికారాన్ని చేపట్టాయి. కానీ రెండు పార్టీల్లో అంతర్గత విభేదాలు ప్రభుత్వాన్ని కూల్చివేశాయి. ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికలు తమ సిట్టింగ్ స్థానం కాబట్టి గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. పదిహేను స్థానాల్లో కనీసం పదికిపైగా గెలిచినా తిరిగి సంకీర్ణ సర్కార్ కర్ణాటకను ఏలే అవకాశముంటుంది.కానీ జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ లు కర్ణాటకలో ఇక కలసి పోటీ చేయవని దాదాపుగా తేలిపోయింది. జనతాదళ్ ఎస్ అధినేత దేవెగౌడ ఉప ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల్లో కలసి పోటీ చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఒంటరిగానే అన్ని ఉప ఎన్నికలను ఎదుర్కొంటామని జేడీఎస్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొనడం విశేషం. దీంతో ఈ పదిహేను నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ జరిగే అవకాశం ఉంది.కాంగ్రెస్ కూడా ఇప్పటికే ఒంటరిపోరుకు సిద్ధమయింది. అయితే త్రిముఖ పోటీ ఎవరికి లాభమన్న చర్చ జోరుగా సాగుతుంది. ప్రస్తుతం ఉన్న సర్కార్ పై ఉన్న వ్యతిరేక ఓటు చీలితే అది బీజేపీకి లాభమవుతుంది. అలా కాకుండా కాంగ్రెస్ ఓటు బ్యాంకు పటిష్టంగా కాపాడుకోగలిగితే సానుభూతి ఓట్లతో గెలుపొందవచ్చన్నది కాంగ్రెస్ ఆశగా ఉంది. అయితే ఒంటరిగా జేడీఎస్, కాంగ్రెస్ లు పోటీ చేసినా కొన్ని నియోజకవర్గాల్లో లోపాయికారిగా సహకరించుకుంటారన్న వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద ఉప ఎన్నికల ద్వారా మరోసారి గద్దెనెక్కే ఛాన్స్ ను కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ లు మిస్ చేసుకుంటాయా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.