ముందుకు సాగని శ్రీ రాం సాగర్ పనులు
నిజామాబాద్,
ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రయోజనం చేకూర్చే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అభివృద్ధికి దశాబ్ద కాలం తరువాత గతేడాది భారీగా నిధులు మంజూరయ్యాయి. నిధులున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. గతేడాది ఆగస్టులో సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం శంకు స్థాపన కోసం ప్రాజెక్ట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీలో పలు అభివృద్ధి పనుల కోసం రూ. 26 కోట్లు, లక్ష్మి కాలువ ఆధు నికీకరణకు రూ. 20 కోట్లు మంజూరు చేశారు. ఏడాది క్రితం టెండర్లు పూర్తయిన ఇప్పటికీ 80 శాతం పనులు ప్రారంభం కాలేదు. అధికారులేమో పనులు ప్రారంభించాలని కాం ట్రాక్టర్లకు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నా రు. పనులు సకాలంలో ప్రారంభించని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.ఎస్సారెస్పీ ఆనకట్ట రివిట్ మెంట్ మరమ్మతుల కోసం రూ. 5 కోట్ల 34 లక్షల 70 వేలు మంజూ రు అయ్యాయి. రివిట్ మెంట్ పనులను వేసవి కాలంలో ప్రారంభించి ఎట్టకేలకు చివరి దశకు తీసుకు వచ్చారు. ప్రస్తుతం ఆనకట్టపై పెరిగిన చెట్లను తొలిగించే పనులు చేపడుతున్నారు.ప్రాజెక్ట్ ఆనకట్ట కుడి, ఎడమలు కలిపి 13.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. పూర్తిగా గుంతల మయంగా మారింది. బీటీ తొలగిపోయి మొత్తం మట్టి రోడ్డు ఏర్పడింది. బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్ల 64 లక్షల 30 వేలు మంజూరయ్యాయి. పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు.శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ జాతీయ రహదారి 44 నుంచి ప్రాజెక్ట్ వరకు గల మూడు కిలోమీటర్ల రోడ్డు తారు కొట్టుకు పోయింది. ఆ రోడ్డు మరమ్మతులకు రూ. కోటి 94 లక్షల 30 వేలు మంజూరయ్యాయి. పనులు ప్రారంభమైన రెండు రోజులకే నిలిచిపోయాయి.శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ లక్ష్మికాలువ ఆధునికీకరణ కోసం రూ. 20 కోట్లు గతేడాది మంజూరు కాగా పనులను మేలో ప్రారంభించారు. కాలువపై అక్కడక్కడా వంతెనల నిర్మాణం, లక్ష్మి లిఫ్టు వద్ద రిటైనింగ్ వాల్ పనులను పూర్తి చేశారు. ప్రస్తుతం కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో పనులు నిలిపి వేశారు. ప్రాజెక్ట్ నుంచి నవంబర్ 15 వరకు నీటి విడుదల కొనసాగుతుంది. రబీలో నీటి సరఫరా చేసే అవకాశం ఉండటంతో వేసవి వరకు పనులు అటకెక్కినట్లే.శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆనకట్టకు ఇరువైపులా ప్రాటెక్షన్ వాల్ నిర్మించడానికి రూ. 8 కోట్ల 31 లక్షల 70 వేలు మంజూరు అయ్యాయి. ఇది వరకే కుడి వైపు కిలోమీటర్, ఎడమ వైపు కిలో మీటర్ మేర సెఫ్టీ వాల్ ఉంది. దానిని పూర్తిగా నిర్మించా లని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్ ప్రక్రియ పూర్తయినా వరకు పనులు ప్రారంభించ లేదు.