టీటీడీ పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారం
తిరుమల
టీటీడీ పాలకమండలి సభ్యులుగా శ్రీనివాసన్, పార్థసారధి, రమణమూర్తిరాజు, మురళీకృష్ణ, జూపల్లి రామేశ్వరరావు, నాదెండ్ల సుబ్బారావులు ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం గరుడాళ్వార్ సన్నిధిలో పాలకమండలి సభ్యులతో జేఈవో బసంత్ కుమార్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవనంలో పాలకమండలి
తొలిసమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై చర్చ జరిగింది. టీటీడీ పాలకమండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా శ్రీనివాసన్, పార్థసారధి, రమణమూర్తిరాజు, మురళీకృష్ణ, జూపల్లి రామేశ్వరరావు, నాదెండ్ల సుబ్బారావులు మీడియాతో మాట్లాడారు. చాలా సంతోషంగా ఉందని ఎన్. శ్రీనివాసన్ అన్నారు. ‘ స్వామి వారికి సేవ చేసుకునే భాగ్యం నాకు కలగటం చాలా సంతోషంగా ఉంది. నాకు పాలకమండలి సభ్యునిగా అవకాశం ఇచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నా ధన్యవాదాలు’ అని అన్నారు. జూపల్లి రామేశ్వరరావు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి అనుగ్రహంతో ఈ అవకాశాన్ని కల్పించిన ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. స్వామి వారి అనుగ్రహంతో సామాన్య భక్తులకు సేవ చేసే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.నిషితా రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో నాకు ఈ అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. భక్తులకు సేవలందించేందుకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ నాపై ఉండాలని స్వామి వారిని ప్రార్ధించాను’అని అన్నారు.
నాదెండ్ల సుబ్బారావు మాట్లాడుతూ ‘విశాఖ శారదా పీఠాధిపతులు చెప్పడం.. నాకు ఈ అవకాశం కల్పించడం చాలా సంతోషంగా ఉంది. కాలినడక మార్గం ద్వారా వచ్చే భక్తులకు, సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తా’ అని అన్నారు.మేడా మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ టీటీడీ పాలక మండలిలో మా కుటుంబానికి రెండవసారి చోటు దక్కడం మా అదృష్టంగా భావిస్తున్నాం. స్వామి వారికి సేవ చేసే భాగ్యం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు. సామాన్య భక్తులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తా. దేవస్థానంలో ఎటువంటి అవినీతికి తావులేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తా’ అని అన్నారు