YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఇసుక ధరాభారం

ఇసుక ధరాభారం

ఇసుక ధరాభారం
ట్రాక్టర్ రూ.7,500.. లారీ రూ.16 వేలు
ధర దిగి వచ్చేది ఎప్పుడు?
రాయపూడి పరిసరాల నుంచి అక్రమంగా గుంటూరుకు రవాణా
ప్రేక్షకపాత్ర వహిస్తున్న యంత్రాంగం
గుంటూరు 
ఇసుక ధర కిందికి దిగి రావడం లేదు. ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన నూతన విధానంతో ధర తగ్గాల్సిందిపోయి రోజు రోజుకు మరింత పెరుగుతోన్నది. కృష్ణానదికి వరద కారణంగా ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయని ప్రభుత్వం ఒకవైపు చెబుతుండగా మరోపక్క రాయపూడి పరిసర ప్రాంతాల నుంచి డ్రెడ్జర్లు పెట్టి ఇసుకని తోడి పారేస్తున్నారు. అదే ఇసుకని జిల్లా కేంద్రానికి తీసుకొచ్చి ట్రాక్టర్ అయితే రూ.7,500, లారీ అయితే రూ.16 వేలకు విక్రయిస్తున్నారు. అసలే నిర్మాణాలు మూడు నెలలకు పైగా నిలచిపోయి ఉండటంతో మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భావిస్తూ చాలామంది అధిక ధరకే ఇసుకని కొనుగోలు చేస్తున్నారు.
చెలరేగిపోతున్న ఇసుక మాఫియా : కృష్ణానదికి గత కొద్ది రోజులుగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో రీచ్లన్నింటిలోకి వరదనీరు వచ్చి చేరడంతో అక్కడ ఇసుక తవ్వకాలు పూర్తిగా నిలిచిపోయాయి. కొల్లిపర, కొల్లూరు మండలాల్లోని ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు నిలిచాయి. ఇదే అదనుగా రాయపూడిలో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. అధికార పార్టీ నేతల అండదండలతో పేట్రేగిపోతోంది. రాయపూడి, బోరుపాలెం, ఉద్ధండ్రాయునిపాలెంలోనూ ప్రస్తుతం వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో మనుషులు వెళ్లి ఇసుక తోడటం వీలు కాదు. పైగా అక్కడ ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవు. అయినప్పటికీ జిల్లా కేంద్రానికి అక్కడినుంచే ఇసుక రవాణ జరుగుతోంది. ఇప్పుడొచ్చే ఇసుక నాణ్యతతో కూడుకొని ఉంటుంది. ఈ నేపథ్యంలో మాఫియా సొమ్ము చేసుకొంటోంది. అమరావతి రోడ్డులో ఇసుక ట్రాక్టర్లు, లారీలు యథేచ్ఛగా తిరుగుతున్నా వాటికి అడ్డుకట్ట వేసే పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు కరువయ్యారు.జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలి : ఇదిలావుంటే కృష్ణానదికి వరద స్థిరంగా కొనసాగుతుండటంతో అధికారిక స్టాక్ పాయింట్ల నుంచి ఇసుక విక్రయాలు ఇప్పుడప్పుడే పునరుద్ధరణ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో అధిక ధరకి అయినా ఇసుక లభ్యం అవుతుండటంతో చాలామంది భవన యజమానులు రాయపూడి నుంచి వచ్చే ఇసుక కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. పేద ప్రజలు మాత్రం అంత ధర పెట్టి ఇసుక కొనుగోలు చేయలేక తమ నిర్మాణాలను ఇంకా పునఃప్రారం భించుకోలేకపోతున్నారు. అమరావతిలో రద్దు అయిన ఇసుక టెండర్లకు తిరిగి రివర్స్ ఆక్షన్ నిర్వహించినప్పటికీ ఇంకా కాంట్రాక్టర్ని ఖరారు చేయలేదు. ఇది కూడా ఇసుక ధర ఆకాశాన్ని అంటడానికి కారణంగా నిలుస్తోంది. గ్రామ సచివాలయాల ఏర్పాటు, అభ్యర్థుల నియామక ప్రక్రియలో బిజీగా ఉన్న అధికారులు ఇసుక గురించి పట్టించుకోవడం లేదు. జిల్లా కలెక్టర్గా కోన శశిధర్ ఉన్న సమయంలో ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకున్నారు. ఆ దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Related Posts