చకచకా.. బ్రహ్మోత్సవ ఏర్పాట్లు
తిరుమల
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. టీటీడీలోని వివిధ విభాగాలు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇంజినీరింగ్ విభాగం పెద్దఎత్తున సివిల్, ఎలక్ర్టికల్ పనులు చేపట్టింది. కొండపై పలు ప్రాంతాల్లో భారీ దేవతా ప్రతిమల కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. రహదారులకు ఇరువైపులా ఉన్న వృక్షాలు, భవనాలు, ఎత్తయిన కట్టడాలకు రంగురంగుల విద్యుద్దీప తోరణాలు అమరుస్తున్నారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మతులు, తారు ప్యాచ్ వర్కులు, కొన్ని ప్రాంతాల్లో కాంక్రీట్ వేసే పనులు చురుగ్గా సాగుతున్నాయి. కల్యాణవేదిక వద్ద ఫలపుష్ప ప్రదర్శనశాల ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. పలు రంగాలకు చెందిన నిపుణులు అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా అత్తి వరదరాజస్వామి ఆలయ సెట్టింగ్ను ఏర్పాటు చేస్తున్నారు. మహారథానికి రంగులు దిద్దుతున్నారు. ఆలయం ముందు, తూర్పు మాడవీధిలో నిపుణులు ఆకర్షణీయంగా రంగవల్లులు వేస్తున్నారు. స్వాగత తోరణాలు, కూడళ్ల వద్ద వుండే వాటర్ఫౌంటెన్లకు విద్యుత్ అలంకరణలు, రాంభగీచ విశ్రాంతి గృహాల ముందు భాగంలో విద్యుదీపాలతో సప్తద్వారాలు ఏర్పాటు చేసే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మాడవీధుల్లో పెద్దసంఖ్యలో చెత్తకుండీలు ఏర్పాటు చేస్తున్నారు.