ఆడబిడ్డలకు సారే పెట్టి పంపే సంస్కృతి మనది - మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి
ఎంత పేదరికం ఉన్నా ఏడేండ్లు దాటకుండా ఆడబిడ్డలకు సారే పెట్టి పంపే సంస్కృతి మనదిని, పండుగనాడు పేద బిడ్డలు సంతోషంగా ఉండాలన్నదే బతుకమ్మ చీరల పంపిణీ పథక ఉద్దేశ్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం వనపర్తి పట్టణంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, కలెక్టర్ శ్వేతా మహంతి, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొని చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రజల దీవెనలు ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉండాలని, ప్రభుత్వం అమలు పరిచే ప్రతి పథకం వెనుక ఒక మానవీయ కోణం ఉందని ఆయన అన్నారు. పేద ప్రజలు సంతోషంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి లక్ష్యమని ,అలాగే ప్రతి ఒక్కరు ఆత్మాభిమానంతో బతకాలన్న దే ముఖ్యమంత్రి ఆకాంక్షని ఆయన అన్నారు. ఉన్నోళ్లు ముందు వేలవేల పోవద్దని పేదలకు చీరల పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.2 కోట్ల చీరల పంపిణీ జరుగుతుందని, నీళ్లు లేక, వానలు రాక, పశువులకు మేత లేక, అప్పులపాలై నా స్థితిలో పేద రైతులు ఆడబిడ్డను పండగకు పిలుచుకో లేని దుస్థితి రాసిన తెలంగాణ ఉద్యమ పాటను ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం లో ఆ పరిస్థితి ఉండకూడదనే వ్యవసాయానికి దన్నుగా, రైతులకు భరోసాగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. ఏ రైతు కూడా కాడెద్దులు అమ్ముకోవద్దని, ఏ రైతు వ్యవసాయం సాగక ఉరి పోసుకుని వద్దు అన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి, రైతుబంధు, రైతు బీమా పథకాలు రైతాంగానికి బాసటగా నిలవడం కోసమే ముఖ్యమంత్రి రాష్ట్రమే తన కుటుంబం అన్న కోణంలో ఆలోచిస్తారని ఆయన అన్నారు. అందుకే కళ్యాణ లక్ష్మి లాంటి పథకం వచ్చిందని, ఆడబిడ్డలకు అమ్మ ఒడి, కెసిఆర్ కిట్ అమలు అవుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుపరుస్తున్న 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంలో గ్రామాల్లో ఎంతో సక్రమంగా అమలయి గ్రామాలన్నీ శుభ్రంగా మారి రోగాల నివారణకు నాంది పలుకుతున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, కలెక్టర్ శ్వేత మహంతి, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ తదితరులు ప్రసంగించారు