ఒంగోలు, అవును. రాజు మారినా.. రాజ్యాలు మారవనే సామెత.. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం విషయంలో స్పష్టమవుతోంది. ఇక్కడ నుంచి కాస్తలేటుగా రాజకీయాల్లోకి వచ్చినా.. లేటెస్టు రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్నాడు ఆమంచి కృష్ణమోహన్. కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ సీఎం, మాజీ గవర్నర్ రోశయ్యకు ప్రియ శిష్యుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆమంచి వేటపాలెం జడ్పీటీసీగా రాజకీయ జీవితం ప్రారంభించారు.ఆ తర్వాత తన రాజకీయ గురువు రోశయ్య అండదండలతో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికయ్యారు. ప్రజలందరికి అందుబాటులో ఉండే ఎమ్మెల్యేగా పేరు గడించాడు. అయితే, అదే సమయంలో దూకుడున్న నాయకుడిగా కూడా ఆమంచి కృష్ణమోహన్ పేరు తెచ్చుకున్నారు. 2014కు ముందు వరకు కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నఆమంచి కృష్ణమోహన్ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్టీ మారిపోయి.. ఏ పార్టీలోకి వెళ్లకుండా చీరాల నవోదయం అనే స్వతంత్ర పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధిం చారు. ఆ వెంటనే రాజకీయంగా ఉపయోగపడతాడనే ఉద్దేశంతో ఆమంచి కృష్ణమోహన్ ని చంద్రబాబు.. తన పార్టీలోకి ఆహ్వానించారు.ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో ఉన్నా టీడీపీ వర్సెస్ ఆమంచి వర్గం మధ్య చీరాలలో ఎప్పుడూ రాజకీయ వైరం నడుస్తూనే ఉండేది. ఇక, ఎన్నికల సమయానికి మాత్రం మళ్లీ ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి ఝలక్ ఇచ్చి.. వైసీపీ పంచకు చేరిపోయారు. ఈ పరిణామంతో చీరాల రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో చంద్రబాబు ఇక్కడకు ఎన్నికల సమయంలో అద్దంకి నుంచి కరణం బలరామకృష్ణమూర్తిని తీసుకువచ్చి.. టికెట్ ఇచ్చారు. ఇంత జగన్ సునామీలోనూ కరణం విజయం సాధించారు. అప్పటి వరకు తనకు తిరుగులేదని భావించిన ఆమంచి కృష్ణమోహన్ విజయానికి దూరమయ్యారు. అయితే, ఓడినా పైచేయి నాదే .. అనే టైపులో ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ చే స్తున్న హడావుడి షరా మామూలే అన్న విధంగా సాగుతోంది. ఇక్కడ రాజకీయాల్లో తన దైన ముద్ర ఉండా లని, తన దైన శైలిలో ఆయన దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. పోలీసులపై కూడా ఒత్తిళ్లు తీసుకువస్తున్నారనే వ్యాఖ్యలు, వార్తలు వినిపిస్తున్నాయి.తాను ఓడినా.. త పార్టీ అధికారంలో ఉంది కాబట్టి.. తన మాటే చెల్లాలనే రేంజ్‌లో ఆమంచి కృష్ణమోహన్ ఇక్కడ వ్యవహరిస్తుండడం ఆసక్తిగా మారింది. కొన్నాళ్లు దీనిపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినా.. తర్వాత మాత్రం మౌనం వహించారు టీడీపీ నుంచి విజయం సాధించిన కరణం బలరామకృష్ణమూర్తి. దీంతో ఈ నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ హవానే కొనసాగుతుందనే వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి.అటు బలరాం సైతం ప్రతి విషయంలోనూ ఆమంచి కృష్ణమోహన్ కి అడ్డు తగిలేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అధికారులు అందరిని తన గ్రిప్‌లో పెట్టుకున్న ఆమంచి ఏ మాత్రం వెనక్కు తగ్గం లేదు. ఈ క్రమంలోనే అటు కరణం బలరాం తన అఫిడవిట్‌తో తన రెండో భార్య వివరాలు సైతం పొందుపరచలేదని హైకోర్టులో ఫిటిషన్ కూడా వేసిన సంగతి తెలిసిందే. ఏదేమైనా చీరాలలో ఆమంచి వర్సెస్ కరణం మధ్య పోటాపోటీ రాజకీయం నడుస్తోంది.