ఏలూరు, చాలాకాలం తర్వాత విజిలెన్స్ విభాగం పూర్తిస్ధాయిలో జవసత్వాలను పుంజుకుని రంగంలోకి దిగినట్లు కన్పిస్తోంది. రైతులకు మేలు చేకూర్చే ఉద్దేశ్యంతో ఏర్పాటుచేసిన రైతుబజార్లు చివరకు కొంతమంది అధికారులు, సిబ్బందికి వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయన్న ఆరోపణలు విన్పిస్తూనే ఉన్నాయి. దానికితగ్గట్టుగానే ఏలూరులోని రైతుబజారుపై విమర్శలు, ఆరోపణలే కాకుండా పలు సందర్భాల్లో వ్యాపారస్తులు, అధికారులతో కొనుగోలుదారులు వివాదాలు దిగిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయిదాదాపుగా ఒకటి,రెండు సంవత్సరాల నుంచి వివిధ వ్యవస్ధల తీరుపై ఫిర్యాదుల వర్షం కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా రైతుబజార్లు, వసతిగృహాలు ఇలా అధికశాతం లబ్దిదారులకు మేలు చేకూర్చే వ్యవస్ధలు క్రమంగా పక్కదారి పడుతున్నాయని, దీనిపై కొంతమంది లక్షలు ఆర్జిస్తున్నారని అసంతృప్తి పలు సందర్భాల్లో వ్యక్తమవుతూనే వస్తోంది.ఇంతకుముందు విజిలెన్స్ విభాగం చిన్న ఫిర్యాదు వచ్చిన వెంటనే రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించి తేడా ఉంటే నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయటమే కాకుండా ఆ వ్యవహారాలు మరోసారి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకునేది. కొద్దికాలంగా ఈ వ్యవహారం కొంత చతికిలపడిందనే చెప్పాలి. తాజాగా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంగా మరోసారి రంగంలోకి దిగి తన సత్తా ఏమిటో చూపేందుకు అన్నివిధాలా సిద్ధమైనట్లు కన్పిస్తోంది. కొన్నిరోజులుగా వివిధ ప్రాంతాల్లో విజిలెన్స్ దాడులు జరగడం, వాటిపై అంతకుముందు పెద్దఎత్తున విమర్శలు వచ్చి ఉండటం, ఈదాడుల్లో పలు అవకతవకలు గుర్తించి విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేయటం జరిగిపోయింది.. ఇలాంటి నేపధ్యంలో విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగటమే కాకుండా ఏలూరులోని పత్తేబాద రైతుబజారుతోపాటు పాలకొల్లు రైతుబజారును విస్తృతంగా తనిఖీ చేశారు. అయితే ఇది అంతా మొక్కుబడిగా అధికారులు భారీసంఖ్యలో అక్కడకు వెళ్లి ముందస్తు సమాచారాలు ఇచ్చి వ్యాపారస్తులు జాగ్రత్తపడే పరిస్దితి లేకుండా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుని విజిలెన్స్ ఎస్పీ స్వయంగా కూరలు కొనుక్కునేందుకు వచ్చిన సాధారణ కొనుగోలుదారునిగా లోనికి ప్రవేశించి అక్కడున్న పరిస్దితిని అధ్యయనం చేసి ఆతర్వాత అధికారిక దాడి ప్రారంభించటంతో రైతుబజారు అధికారులతో పాటు వ్యాపారస్తులు కూడా నివ్వెరపోయారు.