కడప, కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయం ఆసక్తిగా మారింది. ఒకప్పుడు ఇక్కడ తిరుగులేని ఆధిపత్య ప్రదర్శించిన టీడీపీ… తర్వాత కాలంలో వెనక్కి తగ్గింది. పార్టీ ప్రారంభించిన సమయంలో 1985లో ఇక్కడ నుంచి పోటీ చేసిన పొన్నపురెడ్డి శివారెడ్డి వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. తర్వాత కూడా పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి మరో రెండు సార్లు వరుసగా టీడీపీని ఇక్కడ గెలిపించారు. దీంతో ఈ నియోజకవర్గం పొన్నపురెడ్డి వర్గీయులకు పెట్టని కోటగా మారిపోయింది. అయితే, తర్వాత కాలంలో మాత్రం.. తన సొంత జిల్లాలో టీడీపీని అణిచేయాలనే లక్ష్యంగా పావులు కదిపిన అప్పటి కాంగ్రెస్ నేత., దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదిపారు.తన ముద్ర పడేలా జమ్మలమడుగు రాజకీయాలను మార్చేశారు. ఈ క్రమంలోనే 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. ప్రొఫెసర్‌గా ఉన్న ఆదినారాయణరెడ్డి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి జమ్మలమడుగు రాజకీయాలను శాసించారు. వైఎస్ అండదండలు కూడా పుష్కలంగా ఉండడం… ఇక్కడ వైఎస్ ఫ్యామిలీకి పర్సనల్ ఇమేజ్ కూడా జమ్మలమడుగులో ఆదికి ప్లస్ అయ్యింది. దీంతో ఇక్కడ టీడీపీ హవా తగ్గిపోయింది.ఇక, రాష్ట్ర విభజన తర్వాత ఆయన వైసీపీ గూటికి చేరిపోయారు. దీంతో 2014లో జగన్ ఆదికే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. 2017 వచ్చే సరికి రాజకీయ సమీకరణలు మారిపోయాయి. టీడీపీ అధినేత, అప్పటి సీఎం చంద్రబాబు రాజకీయ చక్రం తిప్పడంతో వైసీపీ తరపున గెలిచిన ఆది .. మంత్రి పదవిపై ఆశతో టీడీపీ గూటికి చేరిపోయారు. మంత్రి కూడా అయ్యారు. ఈ క్రమంలోనే జమ్మలమడుగులో తన ఆధిపత్యం కోసం అప్పటి వరకు రామసుబ్బారెడ్డి వర్గంతో పోరు పడ్డ ఆయన రాజీ ధోరణితో ముందుకు సాగారు.ఇక, తాజా ఎన్నికల్లో తను చెప్పినట్టే ఇక్కడ జరుగుతుందని భావించారు. ఈ క్రమంలో చంద్రబాబు రామ సుబ్బారెడ్డికి టికెట్ ఇస్తే.. తాను కడప నుంచి పోటీ చేశారు. కానీ,జమ్మలమడుగులో మాత్రం వీరు ప్రజల మనసులు గెలవలేక పోయారు. ఫలితంగా వైసీపీ తరపున పోటీ చేసిన డాక్టర్ సుధీర్ రెడ్డి విజయం సాధిం చారు. ఇక, టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆదినారాయణరెడ్డి ఇప్పుడు ఆ పార్టీ కి దూరంగా ఉంటున్నారు. రామసుబ్బారెడ్డి ఔట్‌డేట్ అయిపోయారు. ఇన్ని ప్రయత్నాలు చేసినా.. తాను గెలవకపోవడంతో ఆయన రాజకీయంగా సన్యాసం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారనే సమాచారం అందుతోంది.గత మూడు సార్లు జమ్మలమడుగు నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డి ఇప్పుడు బీజేపీలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తుంటే.. నాలుగు సార్లు వరుసగా ఓడిన రామసుబ్బారెడ్డి రాజకీయ సన్యాసం దిశగా సాగుతున్నారు. చంద్రబాబు నుంచి కూడా ఆయనకు ఎలాంటి భరోసా లభించడం లేదని తెలుస్తోంది. జమ్మలమడుగు రాజకీయాల్లో మూడున్నర దశాబ్దాలుగా రెండు వైరి వర్గాలకు నేతృత్వం వహించిన ఈ ఇద్దరు నేతలు కలిసినా కూడా అక్కడ వైసీపీ అభ్యర్థి సుధీర్‌రెడ్డి ఏకంగా 50 వేల ఓట్ల మెజార్టీతో గెలవడం ఎవ్వరికి మింగుడు పడడం లేదు. ఇక్కడ టీడీపీకి భవిష్యత్తులో నేతృత్వం వహించే నేతే కనుచూపు మేరలో కనపడడం లేదు. ఈ నేపథ్యంలో జమ్మలమడుగులో వైసీపీ తప్ప మరో పార్టీ కనిపించే అవకాశం లేదని అంటున్నారు పరిశీలకులు.