విశాఖపట్టణం, అవును! రాష్ట్రంలో కొందరు నాయకులు రాజకీయ సన్యాసం దిశగానే అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోం ది. వారిలో పుంజుకోవాలనే ఆతృత ఉన్నప్పటికీ.. వారు వేసిన తప్పటడుగుల కారణంగా.. భవిష్యత్ రాజకీ యం శాపంగా మారిపోయింది. దీంతో ఇప్పుడు ఏ పార్టీకి కూడా కాకుండా పోయారు. ఇలాంటి వారు చాలా మందే మనకు ఏపీలో కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కొణతాల రామకృష్ణ పేరు ప్రముఖం గా వినిపిస్తోంది. కాంగ్రెస్‌లో ప్రస్థానం ప్రారంభించిన ఆయన తర్వాత మంత్రిగా కూడా చక్రం తిప్పారు. అయితే, ఆయన పార్టీని వీడడం, తర్వాత వైసీపీలో చేరడం ఈ క్రమంలో ఆ పార్టీకి కూడా దూరం కావడం అందరికీ తెలిసిందే.మంచి వ్యూహకర్తగా, నిజాయితీపరుడిగా కూడా పేరు తెచ్చుకున్న కొణతాల.. తర్వాత కాలంలో మాత్రం పుంజుకోలేక పోయారు ముఖ్యంగా ఇటీవల ఎన్నికల్లో జగన్‌ను కలిసినప్పుడు కూడా తన వ్యవహార శైలి కారణంగా ఆయనకు దూరమయ్యారు. ఇప్పుడు చేష్టలుడిగి చూస్తున్నారు. ఈ కోవలోనే దాడి వీరభద్రరావు రాజకీయం కూడా తారుమారైంది. గతంలో టీడీపీలో ఉండగా.. 2014 ఎన్నికలకు ముందు ఇంకేముంది.. వైసీపీ అధికారంలోకి వస్తుందని భావించి ఆయన పార్టీ మారిపోయారు. ఈ క్రమంలోనే చంద్రబాబును ఆడేసుకున్నారు. ఇక, ఈ అంచనా తల్లకిందులైంది. దీంతో ఆయన మళ్లీ మధ్యలో టీడీపీలో చేరిపోవాలని ప్రయత్నించారు.ఇంకా దీనికి సంబంధించిన చర్చలు సాగుతున్న క్రమంలోనే ఆయన పార్టీని వదులుకున్నారు. అయితే, ఏమైందో ఏమో టీడీపీలో చేరలేదు. మధ్యలో జనసేన అధినేత పవన్ స్వయంగా దాడి ఇంటికి వెళ్లారు. ఇంకేముంది పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరిగినా.. అది కూడా సక్సెస్ కాలేదు. సరే ఎన్నికలకు ముందు జగన్‌కు మళ్లీ జై కొట్టారు. వైసీపీలో చేరిపోయారు. కానీ, ఏమీ ఆశించింది జరగలేదు. దీంతో ఇప్పుడు ఫ్యూచర్ ఏంటో తెలియక, వృద్ధుడు అయిపోతున్న నేపథ్యంలో ఏం చేయాలో అర్ధం కాక సతమతమవుతున్నారు.ఈ క్రమంలోనే మరో నేత హర్షకుమార్. అమలాపురం నుంచి ఎంపీగా కాంగ్రెస్ హయాంలో గెలిచిన ఆయన తర్వాత రాష్ట్ర విభజనతో పార్టీకి దూరమయ్యారు. కొన్నాళ్లు టీడీపీలో చేరతారని అనుకున్నారు. చంద్రబాబు సమక్షంలో చేరారు. అయితే, అనూహ్యంగా అమలాపురం ఎంపీ స్థానాన్ని దివంగత బాలయోగి కుమారుడికి చంద్రబాబు కేటాయించడంతో హర్షకుమార్ సైలెంట్ అయ్యారు. టిక్కెట్ దక్కకపోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు ఏ పార్టీలోనూ లేకుండా.. పోయారు. పోనీ ఎవరైనా పిలుస్తున్నారా? అంటే అది కూడా లేదు. మొత్తానికి వైసీపీ, టీడీపీలో ఇలాంటి నాయకులు చాలా మందే ఉన్నారు. మరి వీరంతా రాజకీయంగా ఎలా ? ముందుకు వెళ్తారో చూడాలి.