విజయవాడ, ఈ ఏడాది 2019 సంవత్సరం ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కలిసిరాలేదా? అనుకున్నది ఒకటైతే.. మరొకటి జరుగుతోందా? అధినేత చంద్రబాబు హవా కూడా భారీగా తగ్గిపోయిందా? పార్టీ పరిస్థితే అగమ్య గోచరంగా మారిందా? అంటే.. జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఈ 9 మాసాల కాలాన్ని పరిగణనలోకి తీసుకుం టే.. జరిగిన పరిణామాలను వడపోస్తే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. జనవరిలో ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో అప్పటి వరకు ఉన్న సంబంధాన్ని చంద్రబాబు తెగతెంపులు చేసుకున్నారు. మంత్రులను వెనక్కి తీసుకున్నారు. అవిశ్వాసం ప్రకటించారు. ధర్మ పోరాట దీక్షలను ఉధృతం చేశారు. అయితే, ఇవేవీ వర్కవుట్ కాలేదు.ఇక, దేశంలో మోడీని వ్యతిరేకిస్తున్నవారిని చంద్రబాబు తెరమీదికి తెచ్చారు. తనకు అనుకూలంగా వారిని మలుచుకోవ డంతోపాటు వారికి కూడా అనుకూలంగా మారిపోయారు చంద్రబాబు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిసి మోడీపై యుద్ధం ప్రకటించారు. అయినా చంద్రబాబుకు సక్సెస్ దక్కలేదు. ఉన్నట్టుండి సంక్షేమ పథకాల పింఛన్లను రెట్టింపు చేశారు. వెయ్యి ఉన్న పింఛన్‌ను2000లకు పెంచారు. పసుపు కుంకుమ పథకాన్ని తెరమీదికి తెచ్చారు. రుణమాఫీతో రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక, ఎన్నికల సమయానికి వచ్చే సరికి మీడియాను బాగానే చంద్రబాబు మేనేజ్ చేశారు.చంద్రబాబు ప్రజలకు వంగి వంగి దండాలు పెట్టారు. తనను గెలిపించక పోతే.. అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. అయినా కూడా గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. పార్టీని చంద్రబాబు అధికారంలోకి తీసుకురాలేక పోయారు. అదేసమయంలో అసెంబ్లీలో బలమైన వాదనను కూడావినిపించలేక పోయారు. పోలవరం వంటి కీలక ప్రాజెక్టును 2018 డిసెంబరు నాటికే పూర్తి చేస్తామని చెప్పిన హామీ కూడా ప్రకటనలకే పరిమితమైంది. దీంతో పార్టీలో విభేదాలు ప్రారంభమయ్యాయి. ఏకంగా చంద్రబాబు నాయకత్వంపైనే మేఘాలు ముసురుకున్నాయి. తన కుమారుడు, మాజీ మంత్రి లోకేష్‌ను మంగళగిరి నుంచి పోటీ చేయించి గెలిపించుకోలేక పోయారు.ఇక పార్టీ చరిత్రలోనే ఎప్పుడు లేనంతగా ఘోరంగా ఓడిపోయి కేవలం 23 సీట్లతో సరిపెట్టుకుంది. పార్టీకి భవిష్యత్ నాయకుడు అవుతాడనుకున్న లోకేష్ ఘోరంగా ఓడిపోవడం ఒక ఎత్తు అయితే.. కంచుకోట కుప్పంలోనూ చంద్రబాబు అత్తెసరు మెజార్టీతో గెలిచారు. ఇక, పార్టీ నుంచి వెళ్లిపోయే సీనియర్లను ఆపడంలో కానీ, వారిని పార్టీకి అనుకూలంగా మార్చుకోవడంలో కానీ చంద్రబాబు విఫలమయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల రోజులకే ఏకంగా నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లిపోయారు.ఇక ఎన్నికల్లో ఓడిన వారు వైసీపీయో లేదా బీజేపీలోకో వెళ్లిపోతున్నారు. ఇలా కీలక నాయకులు చేజారి పోతున్న పరిణామం నుంచి తేరుకోక ముందుగానే సీనియర్లు మరణిస్తుండడం కూడా చంద్రబాబుకు మింగుడు పడడం లేదు. తాను చేపడుతున్న ధర్నాలు, నిరసనలు కేవలం తన వ్యక్తిగత స్వార్థం కోసమేననే విమర్శలను ఎదిరించడంలోను, వాటికి కౌంటర్లు ఇవ్వడంలోను కూడా చంద్రబాబు విఫలమవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు టార్గెట్‌ను పెంచారు. అయినా కూడా ఇది కూడా సక్సెస్ అయ్యే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు.2004లో పార్టీ ఓడిపోయి 47 సీట్లతో సరిపెట్టుకున్నప్పుడు చాలా మంది నేతలు బయటకు వెళ్లిపోయినా… పార్టీ 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పోటీలో ఉన్నా 92 సీట్లు సాధించి గట్టి పోటీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ప్రస్తుత ఎన్నికల్లో ఓడిపోయాక ఎదుర్కొంటోన్న గడ్డు పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఇక నందమూరి ఫ్యామిలీని పక్కన పెట్టి తన వారసుడిని తెరమీదకు తేవడం కూడా ఆ ఫ్యామిలీ అభిమానుల్లో చాలా మందికి నచ్చలేదు. ఇక పార్టీ నుంచి మరికొంత మంది కీలక నేతలు సైతం బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. పార్టీ గ్రాఫ్ కూడా రోజు రోజుకు ప్రజల్లో శరవేగంగా పతనమవుతూ వస్తోంది. ఇలా ఈ ఏడాది చంద్రబాబుకు పెద్దగా కలిసి వచ్చిన పరిణామం అంటూ ఏమీ లేక పోవడం గమనార్హం.