న్యూ ఢిల్లీ, నేరారోపణ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న నేరస్థుడికి సంబంధించిన స్థిరాస్తులను పోలీసులు స్వాధీనం చేసుకోరాదు అని ఇవాళ సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించింది. చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. సీఆర్‌పీసీలోని 102వ సెక్షన్ ప్రకారం.. క్రిమినల్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి ఆస్తులను అటాచ్ చేసే అధికారం పోలీసులకు లేదని కోర్టు చెప్పింది. మహారాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అభ్యర్థనపై ఈ కోర్టు ఈ విధంగా స్పందించింది. ఆస్తులను అటాచ్ చేసే అధికారం పోలీసులకు లేదని ఓ కేసులో బాంబే హైకోర్టు పేర్కొన్నది. దాన్ని మహా ప్రభుత్వం సవాల్ చేసింది.