కడప, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఇంతకూ ఏ పార్టీలో ఉన్నట్లు? తెలుగుదేశమా? బీజేపీనా? జమ్మలమడుగు నియోజకవర్గానికి నిన్న మొన్నటి వరకూ ప్రాతినిధ్యం వహించిన ఆదినారాయణరెడ్డి ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు కూడా చెప్పారు. ఏపీలో బీజేపీ పటిష్టతకు కృషి చేస్తానని కూడా ఆదినారాయణరెడ్డి తెలిపారు. అయితే ఆదినారాయణరెడ్డి ఇప్పటి వరకూ బీజేపీలో చేరలేదు. పార్టీ కండువాను కప్పుకోలేదు. ఆది బీజేపీలో చేరకపోవడానికి గల కారణాలపై కడప జిల్లాలలో జోరుగా చర్చ జరుగుతోంది.మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి వేరే పరిచయం అవసరం లేదు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డి ఆ తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. అప్పటి నుంచి జగన్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేశారు. వైఎస్ జగన్ ఎన్నటికీ ముఖ్యమంత్రి కాలేరని అనేకసార్లు ధీమాతో చెప్పిన ఆదినారాయణరెడ్డి జగన్ పై వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా ఆదినారాయణరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి కడప ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంకి రావడం టీడీపీ దారుణ ఓటమి పాలు కావడంతో ఆదినారాయణరెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కూడా ప్రత్యేకంగా కలసి తాను ఎందుకు పార్టీని వీడాలనుకుంటుందీ చెప్పారు. జగన్ ప్రభుత్వం తనపైనా, తన అనుచరులపైనా కక్ష సాధింపు చర్యలకు దిగనుందని, అందుకోసమే తాను కేంద్రంలో ఉన్నబీజేపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆదినారాయణరెడ్డి తెలిపారు.ఒకసారి హైదరాబాద్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్ జేపీ నడ్డాను ఆదినారాయణరెడ్డి కలిశారు. తర్వాత రెండు సార్లు పార్టీలో చేరేందుకు ఢిల్లీ వెళ్లారు. కాని పార్టీ పెద్దలు ఆయనకు కండువా కప్పలేదు. రెండుసార్లు ఆదినారాయణరెడ్డి నిరాశతోనే ఢిల్లీ నుంచి వెనుదిరిగారు. ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరడం ఆ పార్టీలో ఉన్న మరో నేత సీఎం రమేష్ కు ఇష్టం లేకపోవడం వల్లనే ఆది చేరికకు అడ్డంకి ఏర్పడిందని ఆదినారాయణరెడ్డి వర్గం భావిస్తోంది. అయితే ఆదినారాయణరెడ్డి చేరికకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా సుముఖంగా లేరని చెబుతున్నారు. కన్నా కూడా సీఎం రమేష్ వైపు ఉన్నారన్నది సమాచారం. మొత్తం మీద ఆదినారాయణరెడ్డి ఏ పార్టీలో ఉన్నారన్నది ఇప్పటికీ తేలలేదు. అయితే పార్టీలోకి పిలిచినప్పుడే వెళ్లాలని ఆదినారాయణరెడ్డి నిర్ణయించుకున్నారు.