గుంటూరు, మద్యం దుకాణాల నిర్వాహకులు సిండికేట్లుగా ఏర్పడి మద్యం ధరలు పెంచి మందుబాబుల జేబులు గుల్ల చేస్తున్నారు.జిల్లా వ్యాప్తంగా మొత్తం 342 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇవికాకుండా గ్రామాల్లో వందల సంఖ్యలో బెల్టుషాపులు ఏర్పాటు చేసి యథేచ్ఛగా విక్రయాలు చేస్తున్నారు. ఒక్కో సమయంలో ఒక్కో రేటు నిర్ణయించి విక్రయాలు చేస్తున్నారు. అర్థరాత్రి అయితే ఇక రేటు రెడింతలు అయినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. మద్యానికి బానిసలుగా మారిన వారు ఎంతకైనా తెగించి కొంటున్న దుస్థితి. దీంతో వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. కొందరు తప్పనిపరిస్థితుల్లో మద్యం కోసం దోపిడీలకు పాల్పడుతున్న ఘటనలు నమోదవుతున్నాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వైన్స్ దుకాణాల నిర్వాహకులు ఇష్టానుసారంగా మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారు. పగలు క్వార్టర్ మద్యం ఎమ్మార్పీ కంటే రూ. 5 అదనంగా వసూలు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో క్వార్టర్‌పై రూ. 20 నుంచి రూ. 30 వరకు యథేచ్ఛగా విక్రయాలు కొనసాగిస్తున్నారు. మూడు రోజులుగా అధిక విక్రయాలకు మద్యం సిండికేట్లు తెరతీశారు. ఇప్పటి వరకు ఎమ్మార్పీకే ఇచ్చాం కదా..మేం కూడా సంపాదించుకోవాలి కదా..అంటూ అధికారుల అనుమతితోనే విక్రయిస్తున్నామంటూ నిర్వాహకులు సమాధానం చెప్పడం గమనార్హం.అర్బన్ జిల్లా పరిధిలోని ఓ మద్యం దుకాణం వ్యాపారి తాను పర్మిట్ రూం ఏర్పాటు చేసిన కారణంగా అదనంగా రూ. 5 వసూలు చేసుకుంటాననీ, ఏ నిబంధనల ప్రకారం కేసులు రాస్తారో చూస్తానంటూ గత పదిహేను రోజులుగా ఎమ్మార్పీ కంటే అదనంగా వసూలు చేస్తున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు అతడికి వత్తాసు పలుకుతూ వారు కూడా అదనంగా రూ. 5 చొప్పున మూడు రోజులుగా దండుకుంటున్నారు. గుంటూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి. రేణుక వారం రోజులుగా వ్యక్తిగత సెలవులో ఉండటం వారికి కలసి వచ్చింది. ఆమె విధుల్లో ఉన్న సమయంలో వ్యాపారులు ఆమెను ఒప్పించి అధిక రేట్లకు విక్రయించేందుకు విఫలయత్నం చేశారు. ఆమె సెలవుపై వెళ్లడంతో వ్యాపారులు నిబంధనలకు నీళ్ళొదిలారు. ఇన్‌చార్జిగా కొనసాగుతున్న సూపరింటెండెంట్ శౌరీ మద్యం వ్యాపారులతో మాట్లాడినా ప్రయోజనం లేకపోయిందని మందుబాబులు విమర్శిస్తున్నారు. జిల్లాలోని మిగిలిన మద్యం వ్యాపారులు వారికి కూడా అవకాశం కల్పించాలంటూ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో పైరవీలు చేస్తున్నట్లు సమాచారం.