విజయవాడ, తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్త అవసరమేమో అనిపిస్తుంది. అవుట్ డేటెడ్ అయిన వ్యూహాలు పార్టీకి వర్క్ అవుట్ కావడం లేదు. దీంతో సరైన వ్యూహకర్త కోసం చంద్రబాబు అన్వేషిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో్ చర్చ జరుగుతుంది. మిషన్ 2024ను దృష్టిలో పెట్టుకుని సరైన వ్యూహకర్తను ఎంపిక చేసే బాధ్యతను పార్టీ సీనియర్ నేతకు చంద్రబాబు నాయుడు అప్పగించినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలయిన సంగతి తెలిసిందే. ఎన్నిరకాల వ్యూహాలు చంద్రబాబు పన్నినా విజయం వరించలేదు. కేవలం 23 స్థానాలకే పరిమితం కావడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. పార్టీ నుంచి చాలా మంది ఇప్పటికే కొందరు నేతలు వెళ్లిపోయారు. కొన్ని నియోజకవర్గాల్లో సరైన నేత కూడా లేరు. దీంతో చంద్రబాబు వ్యూహకర్త కోసం వెదుకులాడుతున్నారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వ్యూహకర్త లేకుంటే పార్టీ పుంజుకోవడం కష్టమేనని సీనియర్ నేతలు కూడా చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎన్నికల వ్యూహకర్తను నియమించాలన్న చంద్రబాబు ఆదేశంతో ఒక సీనియర్ నేత అదేపనిలో ఉన్నారని చెబుతున్నారు.2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ జగన్ కూడా ఎన్నికల వ్యూహకర్తను నియమించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ ను వ్యూహకర్తగా నియమించుకుని ఆయనకు జగన్ అన్ని రకాల అధికారాలను అప్పగించారు. సర్వేల బాధ్యతతో పాటు అభ్యర్థుల ఎంపికపై కూడా ప్రశాంత్ కిషోర్ టీం మీదనే జగన్ ఆధారపడ్డారన్నది అతిశయోక్తి కాదు. ప్రశాంత్ కిషోర్ టీం దాదాపు రెండేళ్లకు ముందుగానే రంగంలోకి దిగి అంచనాలను రూపొందించుకునే పనిలో పడింది. పాదయాత్ర దగ్గర నుంచి ఎన్నికల వరకూ ఐదు సర్వేలు చేసి జగన్ కు ఇచ్చింది. దీంతో జగన్ విజయం సునాయాసమయింది. ఇప్పుడు జగన్ స్ట్రాటజీనే చంద్రబాబు అవలంబించనున్నారని తెలుస్తోంది.తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. క్షేత్రస్థాయిలో కూడా క్యాడర్ బలంగా ఉంది. కేవలం 23 స్థానాలు వచ్చినా గత ఎన్నికల్లో 40 శాతం ఓట్లను సాధించింది. చంద్రబాబు సమర్థతపై కూడా ఎవరికీ అనుమానాలు లేవు. అయితే సరైన అభ్యర్థుల ఎంపిక జరగకపోవడం, వ్యూహాలు అనుసరించక పోవడం వల్లనే గత ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూడాల్సి వస్తుందని చంద్రబాబు అంతర్గత సమావేశాల్లో సయితం అంగీకరిస్తున్నారు. స్థానికసంస్థల ఎన్నికలకు ముందే వ్యూహకర్తను నియమించాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ప్రశాంత కిషోర్ ను వ్యూహకర్తగా నియమించుకోవడంపై చంద్రబాబు జగన్ ను ఎద్దేవా చేశారు. ఎన్నికలకు బీహారీ వ్యూహకర్త కావాల్సి వచ్చిందా? అని ప్రశ్నించారు. సోషల్ మీడియాను కూడా బలోపేతం చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు. పార్టీలో కూడా ఈ డిమాండ్ విన్పిస్తోంది.