గుంటూరు, బంపర్ మెజారిటీతో గెలిచిన పార్టీల్లో ఆనందం ఆవిరి కావడానికి ఎక్కువ కాలం పట్టదేమో. అతి ఎపుడు అనర్ధమేనంటారు. రాజకీయాల్లో అయితే దానికి బోలేడు ఉదంతాలు కళ్ల ముందు కనిపిస్తాయి. ఉమ్మడి ఏపీలో మొత్తానికి మొత్తం సీట్లు మిత్రపక్షాలైన వామపక్షాలతో కలసి 1995 ఎన్నికల్లో వూడ్చేసిన అన్న నందమూరి తారకరామారావు కేవలం ఎనిమిది నెలలు తిరగకుండానే పదవీచ్యుతులైపోయారు. దానికి కారణం మితిమీరిన విశ్వాసం, అటు పార్టీకి ప్రభుత్వానికి మధ్య అగాధం ఏర్పడడం, మరో వైపు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధుల మనోభావాలను పూర్తిగా తెలుసుకోకపోవడం. ఇవన్నీ అలాగే జరుగుతాయి మరి. ఇప్పుడు జగన్ పార్టీలోనూ అంతే జరుగుతుంది.విషయానికి వస్తే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ రికార్డ్ బద్దలు కొట్టారు. సొంతంగా తాను పార్టీ పెట్టి మొత్తానికి మొత్తం సీట్లు అసెంబ్లీలో, పార్లమెంట్ లో ఏపీవ్యాప్తంగా లాగేశారు. జగన్ బలమైన నాయకుడిగా అవతరించాక ఇపుడు సరిగ్గా నాటి అన్న గారి పరిస్థితే ఎదురవుతోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. జగన్ పార్టీ తరఫున ఎన్నికల్లో గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలలో సగానికి సగం అంటే 70 మందికి పైగా ఎమ్మెల్యేలను జగన్ ఇప్పటివరకూ స్వయంగా కలవలేకపోయారన్న ప్రచారం సాగుతోంది. బండ మెజారిటీ రావడంతో ఆ హడావుడిలో పడిన ప్రభుత్వ అధినేత తన పార్టీ ఎమ్మెల్యేలకు సమయం కేటాయించలేకపోతున్నారని అంటున్నారు. అదే ఇపుడు చాలామంది ఎమ్మెల్యేలలో అసంతృప్తికి కారణంగా ఉంది.ఇక విశాఖని నోడల్ జిల్లాగా చేసుకుని రాజకీయం నెరపుతున్న జగన్ సన్నిహితుడు విజయసాయిరెడ్డితో విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఇదే రకమైన భావనను వ్యక్తం చేశారని సమాచారం. ప్రభుత్వం తమది అన్న భావన కలగడంలేదని వారు అన్నారని భోగట్టా. పోలీసులు, రెవిన్యూ అధికారుల మీద కూడా ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారని టాక్. తమ మాట ఎక్కడా వినకుండా అధికారులు తమ చిత్తం వచ్చినట్లుగా పని చేసుకుపోతున్నరని, తమకు పూచిక పుల్లంత గౌరవం కూడా దక్కడంలేదని వారు అంటున్నారట. ఇక ప్రభుత్వపరంగా చూసుకుంటే విధానాలు క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలుకావడంలేదని, దాని వల్ల జనంలో మెల్లగా అసంతృప్తి వ్యాపిస్తోందని కూడా ఏకరువు పెట్టారట. ఇసుక పాలసీ వల్ల ఎవరికీ అది అందని పండుగా మారిందని, విశాఖ లాంటి సిటీలో రియల్ ఎస్టేట్ కుప్ప కూలిందని ఎమ్మెల్యేలు పేర్కొన్నారని సమాచారం. జగన్ అనేక పధకాలు ప్రకటిస్తున్నా జనంలోకి అవి పోవడంలేదని కూడా అంటున్నారట. ఈ పరిస్థితులను చక్కదిద్దకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని విజయసాయిరెడ్డికే చెప్పేశారట. మరి చూడాలి ఆయన ఏ రకమైన చర్యలు తీసుకుంటారో.