విజయవాడ, రాజకీయ రాజధానిగా ఉన్న విజయవాడలో కీలక నెతగా ఉన్న తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు గద్దె రామ్మోహన్ సూపర్ సైలెంట్ అయిపోయారు. కొన్నాళ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ సునామీని తట్టుకుని విజయం సాధించారు. అయితే, ఆయన తన సీనియార్టీని గమనించి అసెంబ్లీలో ప్రతిపక్ష ఉపనేత పదవి దక్కుతుందని భావించారు. అయితే, అప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందిన నిమ్మల రామానాయుడు, కమ్మ వర్గానికి చెందిన సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యకు ఈ పదవులు దక్కడంతో అప్పట్లోనే గద్దె ఫీలయ్యారనే వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో ఆయనను చంద్రబాబు తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ప్రజా సమస్యలపై దూరదృష్టి, వాటిని పరిష్కరించడంలో తనదైన శైలితో ముందుకు సాగే గద్దె రామ్మోహన్.. పార్టీ పరంగా చూసినా.. సీనియరే. గత ప్రభుత్వంలోనే గద్దె రామ్మోహన్ మంత్రి పదవిని ఆశించారు. కానీ, చంద్రబాబు సామాజిక సమీకరణల నేపథ్యంలో గద్దె రామ్మోహన్ ను పక్కన పెట్టారు. రెండో దఫా పార్టీ అధికారంలోకి వస్తే.. ఖచ్చితంగా తనకు పదవి వస్తుందని అనుకున్న గద్దె రామ్మోహన్ పార్టీ కోసం చాలానే కృషి చేశారు.మేనిఫెస్టో కమిటీలో సభ్యుడిగా ఉండి.. కొన్ని సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. ఆయన సతీమణి కృష్ణాజిల్లా.. జెడ్పీ చైర్ పర్సన్‌గా ఐదేళ్ల పాటు ఉన్నారు. గద్దె రామ్మోహన్ గతంలో విజయవాడ ఎంపీగా పనిచేయడంతో పాటు గన్నవరంలో ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లాలో ప్రతి ఎన్నికకు ఆయన ఎన్నోసార్లు త్యాగాలు చేశారు. అయినప్పటికీ.. తన సీనియార్టీని గుర్తించడం లేదని గద్దె రామ్మోహన్ లోలోనే మదన పడుతున్న పరిస్థితి ఉంది. ఇదిలావుంటే, అత్యంత కీలకమైన పీఏసీ చైర్మన్ పదవైనా తనకు దక్కుతుందేమోనని గద్దె రామ్మోహన్ ఎదురు చూశారు. కానీ, ఈ పదవి అనూహ్యంగా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కొట్టుకుపోయారు.ఈ పరిణామం తో గద్దె రామ్మోహన్ మరింత మానసికంగా హర్ట్ అయ్యారనేది వాస్తవం. ఈ క్రమంలోనే కీలకమైన విజయవాడ నగరంలో పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఉండి కూడా అధికార పక్షంపై ఘాటైన విమర్శలు చేయడం లేదు. ఇక గద్దె రామ్మోహన్ ను ఇటు బాబు సైతం పెద్దగా పట్టించుకోకపోవడం… ఈ పరిణామాలను చక్కదిద్దేందుకు పార్టీలో ఎవరూ ముందుకు రాకపోవడం, అధినేతకు, తనకు మధ్య గ్యాప్ పెరిగిపోవడంతో గద్దె రామ్మోహన్ సైలెంట్ అయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ తరఫున నిర్వహిస్తున్న కార్యక్రమాలకు గద్దె రామ్మోహన్ డుమ్మా కొడుతున్నారు. ఈ పరిణామాలతో నియోజకవర్గంలో పార్టీ పుంజుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. మరి చంద్రబాబు ఎలా దీనిని సరిచేస్తారో ? గద్దె రామ్మోహన్ అలక ఎలా ? తీర్చుతారో ? చూడాలి.