కర్నూలు, ఉల్లిగడ్డల ధర ఒక్కసారిగా రెట్టింపు కావడంతో వినియోగదారులు బెంబెలెత్తుతున్నారు. మార్కెట్‌లో కిలో ఉల్లి ధర ఏకంగా రూ.52 పలికింది. వారం రోజుల వరకు కిలో రూ.25 నుంచి రూ.30 వరకు ఉన్న ధర సోమవారం అమాంతం రెట్టింపైంది. దీంతో ఉల్లి పేరెత్తితేనే జనం ఝడుసుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్‌లో మేలురకం ఉల్లి ధర క్వింటాలుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు పలికింది. వారం రోజుల క్రితం అదే ఉల్లి క్వింటాలుకు రూ.2 వేలు మాత్రమే పలికింది. దీంతో మార్కెట్‌కు ఉల్లి తరలిస్తున్న రైతులు లాభాలు చవిచూస్తున్నారు. మహారాష్టల్రో వరదల కారణంగా ఇక్కడి ఉల్లికి డిమాండ్ పెరిగిందని, అందుకే ధర పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. అయితే మార్కెట్‌లో ఉల్లి ధరల పెరుగులపై మంత్రి మోపిదేవి దృష్టి సారించారు. సరసమైన ధరకే ప్రజలకు ఉల్లిగడ్డలు విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బ్లాక్‌మార్కెట్‌కు తరలించేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆదోని డివిజన్‌లోని ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఈసారి బావుల కింద ఉల్లి పంటను భారీగా సాగు చేశారు. పంట చేతికి రావడం, ధర కూడా బాగుండడంతో రైతులు ఉల్లిగడ్డలను మార్కెట్‌కు తరలిస్తున్నారు. మంచి రేటు రావడంతో లాభకరంగా ఉందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. న్నారని పేర్కొంటున్నారు. ఉల్లి ధర పెరగడంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రభుత్వ రంగ సంస్థలు, రైతు బజార్లలో తక్కువ ధరకు ఉల్లి అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.
అటు విజయవాడలోఉల్లిపాయల ధరలు ఘాటెక్కాయి. వినియోగదారుల కంటి తడి పెట్టిస్తోంది. గత నెలలో కిలో రూ.20 నుండి రూ.25 ధరకు లభించిన ఉల్లిపాయలు క్రమేణా రేటు పెరుగుతూ రైతుబజారుల్లో కిలో రూ.35కి చేరాయి. అయినా రైతుబజారుల్లో అసలు ఉల్లిపాయలే లభించడం లేదు. ఏ షాపులోనూ ఉల్లిసాయలు కన్పించకపోవడంతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. పైగా సంచార వ్యాపారుల వద్ద రూ.60 నుండి రూ.65 పెట్టి కొనాల్సి వస్తుంది. గత వారంలో కురిసిన వర్షాల వల్ల కర్నూలు జిల్లాలోని వేలాది హెక్టారుల్లో చేతికి అందాల్సిన ఉల్లి సాగు పూర్తిగా దెబ్బతింది. దాంతో అక్కడ ఉల్లి సాగు రైతులకు నష్టాల ఊబిలో మునిగారు. పంటపోయి ఉల్లి రైతులు కంటతడి పెడుతుండగా ధరలు పెరిగిపోయి వినియోగదారులూ కంటతడి పెడుతున్నారు. నిత్యం వాడే గృహిణులు ఎలాగోలా వాటి వినియోగంలో ఎవ్వరికి వారే రేషన్ విధించుకున్నాగాని తోపుడు బండ్లు, బజ్జీల వ్యాపారులు, అల్పాహారశాల వినియోగదారులు, హోటళ్ల నిర్వాహకులు మాత్రం గిలగిల్లాడుతున్నారు. ఇంకా చిరు వ్యాపారులు అంటే సమోసాలు తయారు చేసుకుని జీవనం సాగించే వారు ప్రత్యామ్నాయంగా క్యాబేజీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇదిలా ఉండగా రైతుబజారుల ఎస్టేట్ ఆఫీసర్లు మాత్రం ఉల్లిపాయల ఇండెంట్లు మాత్రం మార్కెటింగ్ శాఖ అధికారులకు పంపించామంటున్నారు. వినియోగదారులు మాత్రం ప్రభుత్వం తరపున నియంత్రణ ధరలతో ఉల్లిపాయలను రైతుబజారులో అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.