వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు సమీపంలోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో బ్యాక్‌డౌన్ కొనసాగుతోంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పూర్తిగా తగ్గడంతో పాటు జూరాల, శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాల్లో పూర్తిస్థాయి ఉత్పత్తి కొనసాగుతుండటంతో తప్పని పరిస్థితుల్లో కేటీపీపీ 500 మెగావాట్ల మొదటి దశలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. అదే విధంగా రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను ఛత్తీస్‌గఢ్ నుండి కొనుగోలు చేస్తుండడం, ఆ ఒప్పందం ఇంకా కొనసాగుతుండటంతో రాష్ట్రంలోని ముఖ్య ప్రాజెక్టుల్లో బ్యాక్‌డౌన్ కొనసాగేలా జెన్‌కోఅధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే కేటీపీపీ మొదటి దశను నిలిపివేసినట్టు సమాచారం. ముఖ్యంగా ఈ వర్షాకాల సీజన్ నుండి వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతులు కూడా విద్యుత్ మోటార్లను వినియోగించడం లేదు. దీంతో వ్యవసాయ రంగానికి పెద్దగా డిమాండ్ లేకపోవడంతో థర్మల్ ప్రాజెక్టులను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గత నెలలో కూడా కేటీపీపీలో బ్యాక్‌డౌన్ కొనసాగింది. మొత్తం కేటీపీపీలో మొదటి దశ 500 మెగావాట్ల ప్లాంటు, రెండవ దశ 600 మెగావాట్ల ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగేది. ప్రస్తుతం రెండో దశలో కూడా బ్యాక్‌డౌన్ కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎప్పుడూ లేనివిధంగా విద్యుత్ డిమాండ్ తగ్గి ప్లాంట్లను నిలిపివేయడం ఇదే మొదటిసారి అని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా జల విద్యుత్ కేంద్రాలు గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి అందిస్తుండడంతో థర్మల్ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి నిలిపివేసి భారం తగ్గించుకునే యోచనలో జెన్‌కో యాజమాన్యం ఉంది. ప్రస్తుతం కేటీపీపీ మొదటి దశ ప్లాంటును షట్‌డౌన్ చేసి విద్యుత్ డిమాండ్ పెరగకపోతే మరమ్మతుపనులు చేసే యోచనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కేటీపీపీ చరిత్రలో పూర్తిస్థాయి 500 మెగావాట్ల బ్యాక్‌డౌన్ కొనసాగడం ఇదే మొదటి సారి