నల్గొండ, ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీదళానిది తిరుగులేని విజయం. ఆ తర్వాత మూడు నెలల విరామం.. పార్లమెంట్ ఎన్నికల్లో సారు..కారు.. పదహారు..నినాదంతో జనంలోకి వెళ్లిన టీఆర్ఎస్‌కు ఊహించని దెబ్బ.. కేవలం తొమ్మిది స్థానాలకు పరిమితం. ఏకంగా నిజామాబాద్ స్థానంలో గులాబీదళపతి కేసీఆర్ కూతురు, సిట్టింగ్ ఎంపీ కవిత బీజేపీ అభ్యర్థి అర్వింద్ చేతిలో దారుణ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఆ దెబ్బతో రాష్ట్ర వ్యాప్తంగా పాపం టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు కూడా చేసుకోలేదు. గెలిచిన ఎంపీలు చడీచప్పుడుగాకుండా ఉండిపోయారు.అయితే.. తాజాగా.. ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఒత్తిడి మొత్తం అధికార టీఆర్ఎస్‌పై ఉంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో హుజూర్‌నగర్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిపై స్వల్ప మెజార్టీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో తెలంగాణలో మహామహులు అందరూ ఓడిపోయినా ఉత్తమ్ మాత్రం 7 వేలతో విజయం సాధించారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా ఉత్తమ్ గెలవడంతో హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది.అయితే.. ఈ ఉప ఎన్నికలో కూడా సైదిరెడ్డికే టికెట్ ఇవ్వాలని గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీంతో నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. కానీ.. ఎక్కడో ఏదో అనుమానం, ఆందోళన మాత్రం గులాబీదళాన్ని వెంటాడుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని దెబ్బతిన్న తర్వాత టీఆర్ఎస్ కాస్త ఒత్తిడికి లోనైంది. ప్రస్తుతం పరిస్థితులు కూడా అంత అనుకూలంగా ఏమీ లేవు. పలు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్నా.. మరికొన్ని అంశాల్లో మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందిఇటీవల ఎరువుల కోసం రైతులు ఆందోళన బాటపట్టారు. రైతుబంధ చెక్కులు కూడా ఇంకా చాలా మందిరైతులకు అందలేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. నిరుద్యోగ భృతి విషయంలో కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఉద్యోగులు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై గుర్రుగానే ఉన్నారు. ఇక ఇదే సమయంలో హుజూర్‌నగర్ ఉత్తమ్ సొంత నియోజకవర్గం కావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా అంత సలువుగా ఈ స్థానాన్ని చేజార్చుకోదు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతిని బరిలోకి దించే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఈ ఉప ఎన్నికలో గెలిచి.. వచ్చే ఎన్నికలకు బంగారు బాటలు వేసుకోవాలన్న వ్యూహంతో బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలో మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను బరిలోకి దించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.