మెదక్, మియావాకీ’ అనే జపాన్ విధానం అమలుకు గజ్వేల్అడవులు ఇప్పుడు ప్రయోగాత్మకంగా వేదిక అవుతున్నాయి. అధిక పచ్చదనంతో పాటు అధిక ఆక్సిజన్ ఇచ్చేలా చిట్టడవులను సృష్టించాలన్న లక్ష్యంతో అధికారులు ప్రయోగాత్మకంగా ఈ అడవులను పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జపాన్వృక్ష శాస్ర్తవేత్త అకిరా మియావాకీ ఈ కొత్తరకం మొక్కల పెంపకం విధానాన్ని 15 ఏండ్ల కిందట ప్రారంభించారు. ఆ దేశంలో ఈ పద్ధతి అమలు చేసిన అన్ని చోట్లా కొన్నేండ్లలోనే దట్టమైన అడవులు ఏర్పడ్డాయి. జపాన్ లో బాగా సక్సెస్ కావడంతో ఈ విధానంపై సింగపూర్ తో పాటు మరికొన్ని దేశాలూ దృష్టి సారించాయి. మియావాకీ పద్ధతిని అనుసరించి అనేక చోట్ల చిట్టడవులను పెంచుతున్నాయి.గజ్వేల్ ప్రాంతంలోని అడవులలో అధికారులు ప్రయోగాత్మకంగా మియావాకీ విధానానికి శ్రీకారం చుట్టారు. వర్గల్ మండలం సింగాయిపల్లి అడవిలో15 ఎకరాలలో ఈ విధానంలో మొక్కలు నాటారు. గజ్వేల్ అర్బన్పార్కులో 2.5 ఎకరాలలో కూడా మొక్కలు పెంచుతున్నారు. ఇందులో అడవి జాతికి చెందిన నెమలినార, రాయల, నల్లమద్ది, ఎగిస, సీతాఫలం, నీరుద్ది, చింత, రావి, మర్రి, జువ్వి, మేడి, తెల్లమద్ది, ఇప్ప, అల్లనేరేడు, వెదురు, అడవి మామిడి, వేప తదితర మొత్తం 27 రకాల మొక్కలు నాటారు. ఇందుకోసం మొదట భూమిని చదును చేసి, దున్ని ఎరువులు వేసి సిద్ధం చేశారు. మొదట మూడు మీటర్ల ఎడంతో మొక్కలను నాటారు. తర్వాత వాటి మధ్యన అడుగుకో మొక్కను నాటారు. వీటికి అవసరమైన మేరకు నీటిని అందించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.మియావాకీ విధానంలో మొక్కలు నాటితే దట్టమైన అడవులు ఏర్పడతాయి. గజ్వేల్ అడవులలో15 ఎకరాలలో ప్రయోగాత్మకంగా ఈ విధానంలో మొక్కలు నాటాం. రాబోయే రోజులలో ఈ పద్ధతిలో మొక్కల పెంపకాన్ని మరింత విస్తరించటానికి అవకాశం ఉంది. ఈ విధానంలో చిట్టడవులు తయారయి ఎక్కువ ఆక్సిజన్ అందడంతో పాటు పర్యావరణానికి కూడా చాలా మేలు కలుగుతుంది.ఈ విధానంలో ఒకే సారి ప్రక్కప్రక్కనే పలు రకాల మొక్కలు నాటుతారు. ఇందు కోసం పెద్దగా గొయ్యి తీస్తారు. అందులో మొక్కల ఎదుగుదలకు అవసరమైన కంపోస్ట్ఎరువును సారవంతమైన మట్టితో కలిపి గొయ్యిని పూడుస్తారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వృక్ష జాతులను ఎంపిక చేస్తారు. నాటేటప్పుడు వీలైనన్ని ఎక్కువ రకాలుండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.ఒక్కో మొక్క మధ్యన అడుగు దూరం మాత్రమే ఉండేలా నాటుతారు. పక్కనున్న మొక్కల ఎదుగుదలపై ప్రభావం ఉండకుండా ఉండేందుకు ఎత్తు విషయంలో జాగ్రత్తలు పాటిస్తారు. చిన్నవి, మధ్యస్థం, పెద్దవి, పొట్టివి ఇలా వేర్వేరు రకాల మొక్కలను కలిపి ఒకేదగ్గర నాటుతారు. దీంతో మొక్కలు పెరిగి పెద్దయితే.. కనీసం నడిచేందుకు వీలులేనంత దగ్గరగా అల్లుకుపోతాయి.