గుంటూరు, అవును! రాష్ట్రంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎపిసోడ్ గురించి తెలిసిన వారు, దీనిపై వస్తున్న విమర్శలను గమనిస్తున్న వారు, తర్వాత జరుగుతున్న పరిణామాలను చూస్తున్న వారు ఒకే ఒక మాట చెబుతున్నారు.. కోడెల మాట సరే.. ఇప్పుడు అలాంటి చిక్కుల్లోనే ఉన్న మరింత మంది నాయకుల పరిస్థితి ఏంటి ? వారికి అండగా నిలిచేది ఎవరు ? అని ప్రశ్నిస్తున్నారు. కోడెల ఆత్మహత్య అనంతరం, టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన రాజకీయ విమర్శలు అందరికీ తెలిసిందే. అధికార వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్ష సాధింపుల కారణంగానే, కేసుల పరంపర కారణంగానే తమ నాయకుడు కోడెల శివప్రసాద్ ఆత్మ హత్య చేసుకున్నారని చంద్రబాబు ఎదురు దాడి ప్రారంభించారు.ముఖ్యంగా ఫర్నిచర్ విషయంపై చంద్రబాబు కోడెలకు మద్దతుగా మాట్లాడారు. కేవలం లక్షా.. రెండు లక్షల రూపాయలకు సంబంధించిన విషయాన్ని జగన్ ప్రభుత్వం రాజకీయంగా మలుచుకుని, కోడెల శివప్రసాద్ ను వేధించిందని అన్నారు. ఇది కనుక జరగపోయి ఉంటే… కోడెల శివప్రసాద్ జీవించి ఉండేవారని చెప్పుకొచ్చారు. ఓకే చంద్రబాబు వ్యాఖ్యల్లో ఆవేదన ఉంది.. ఆందోళన కూడా కనిపిస్తోంది. కానీ, చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలన్నీ కూడా కోడెల శివప్రసాద్ జీవించి ఉన్న సమయంలో ఏమయ్యాయనే కౌంటర్ స్టేట్‌మెంట్స్ కూడా వస్తున్నాయి. ఇదిలావుంటే, రాష్ట్రంలో ఇప్పుడు కోడెల శివప్రసాద్ మాదిరిగానే కేసులు ఎదుర్కొంటున్న నాయకులు చాలా మందే ఉన్నారు. జగన్ వేధింపులు, కేసులు నిజమైతే.. వీరంతా కూడా మానసికంగా కుంగిపోయి ఉంటారు.ఉదాహరణకు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు, మాజీ విప్ కూన రవికుమార్, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా వంటి వారిపై కేసులు నమోదై ఉన్నాయి. వీరిలో కృష్ణుడు, రవికుమార్ ప్రస్తుతం అజ్ఞాతంలోనే ఉన్నారు. బొండా ఉమా కేసులకు భయపడి సైలెంట్ అయిపోయారని అంటున్నారు. ఇక, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు బెయిల్ రాకుండా కేసులపై కేసులు పెట్టి ఆయన్ను జైల్లోనే ఉంచేలా వైసీపీ సిద్ధమైంది. మరి ఇంత జరుగుతుంటే.. చంద్రబాబు ఇప్పటి వరకు వీరి పక్షాన నిలిచింది కానీ, మాట్లాడింది కానీ, లేదు.కేవలం చంద్రబాబు దృష్టి మొత్తం కేవలం కోడెల శివప్రసాద్ పై పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వీరిని పట్టించు కోకుంటే ఎలా అని పార్టీ సీనియర్ నేతలు సయితం ప్రశ్నిస్తున్నారు. వీరిపక్షాన పోరాడకపోతే ఎలా? అంటూ నిప్పులు చెరుగుతున్నారు. మరి ఇప్పటికైనా చంద్రబాబు వీరిని పట్టించుకుని వారికి మనోధైర్యం కల్పించడంతోపాటు మధ్యే మార్గంగా కేసుల విషయంలో న్యాయపరమైన సాయంతో పాటు పార్టీ అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.