YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

అడ్డూ, అదుపు లేని మట్టి మాఫియా

అడ్డూ, అదుపు లేని మట్టి మాఫియా

ఒంగోలు,  మట్టి మాఫియా ఆగడాలకు రూ.కోట్లతో నిర్మించిన రహదారులు చిధ్రమవుతున్నాయి. టిప్పరులో నాలుగు ట్రాక్టర్లలో వేసే మట్టి పడుతుందని, అలాంటివి మూడు నెలల కాలంలో రాత్రీ పగలు అనే తేడా లేకుండా రహదారులపై తిరగడంతో పాడైయ్యాయని స్థానికులు వాపోతున్నారు. టిప్పర్ల తాకిడితో పాడైన రహదారులు వర్షాకాలంలో కురిసే వానలకు మరింత అధ్వానంగా మారి రాకపోకలకు అవస్థలు పడక తప్పడం లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రేపల్లె-నిజాంపట్నం అడ్డరోడ్డు నుంచి కూచినపూడి వచ్చే ప్రధాన రహదారిని ఆర్‌అండ్‌బీ అధికారులు అభివృద్ధి చేయిస్తుండడంతో స్వార్థపరులు మట్టి తవ్వకాలు తాత్కాలికంగా నిలిపారు. లేకుంటే రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన రహదారి సైతం కొద్దినెలలకే పాడైయ్యే అవకాశం ఉందని తీర గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిజాంపట్నం మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు నిలిచేలా దృష్టి సారించాలని కోరుతున్నారు. గుంటూరు జిల్లా నిజాంపట్నంమండలం ప్రజ్ఞం, చక్కావారిపాలెం, అట్లవారిపాలెం, బొర్రావారిపాలెం తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. వీటిని కొందరు పొక్లెయిన్లను పెట్టించి మరీ నిర్భయంగా సాగిస్తున్నా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో తాటి తోపుల మధ్య ఉన్న దిబ్బలను సైతం విడిచిపెట్టడం లేదు. నిజాంపట్నం మండలంలో మెరక భూములు అధికంగా ఉన్నాయి. భారీ వర్షాలు కురిసి పంట కాల్వల్లో నిండుగా నీరున్నా శివారు భూములకు సాగు నీరు అందని పరిస్థితి. అదే అవకాశంగా చేసుకుని కొందరు అక్రమార్కులు మీ పొలంలో ఒక అడుగు లోతు మట్టిని తవ్వుకుంటామని ట్రక్కుకు రూ.100-150 ఇస్తామని రైతులతో మాట్లాడుకుంటున్నారు. ఈ ఏడాది సాగు చేయకున్నా మట్టి ద్వారా కనీసం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుందన్న ఆశతో పలువురు రైతులు మట్టి తవ్వకాలకు సరేనంటున్నారు. దీంతో మెరక ప్రాంతాలను ఎంచుకుని పొక్లెయిన్లను పెట్టి తవ్వి టిప్పర్లతో పట్టణానికి తరలిస్తున్నారు. ఎకరాలో మట్టి తీసి విక్రయించినందుకు సుమారు రూ.10 లక్షల వరకు ఆదాయం సమకూరుతుండగా పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న గృహ నిర్మాణాలకు మట్టి అవసరం కావడంతో డిమాండ్‌ పెరిగింది. ట్రక్కు మట్టి రూ.1000- 1200 వరకు విక్రయిస్తూ అక్రమార్జన చేస్తున్నారు.సొంత పొలంలోనైనా అడుగు లోతుకు మించి మట్టిని  తవ్వాలంటే గనుల శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి. అలాగే తీసిన మట్టిని విక్రయించడం నేరం. గ్రామాల్లో మట్టి తవ్వకాలు చేపట్టాలంటే తప్పనిరిగా తహశీల్దారు కార్యాలయం నుంచి అనుమతి ఉండాలి. దేవుడు మాన్యం భూముల్లో తవ్వకం చేపట్టాలన్నా ఆ శాఖ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి. అక్రమంగా మట్టిని విక్రయిస్తుంటే చట్టరీత్యా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మట్టి రవాణా చేస్తున్న వాహనాలను సీజ్‌ చేసే అధికారం ఉంది. అయినా రెవెన్యూ, పంచాయతీరాజ్‌, పోలీసు శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పట్టణంలో విచ్ఛలవిడిగా మితిమీరిన వేగంతో తిరుగుతున్న మట్టి టిప్పర్లను పోలీసులు పట్టుకున్నా నాయకుల వత్తిడితో అపరాధ రుసుం విధించి చేతులు దులుపుకుంటున్నారు.

Related Posts