వైసీపీలో అంతర్గత పోరు
విజయవాడ, సెప్టెంబర్ 26,
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా పాలనపైనే దృష్టి సారించారు. 151 మంది ఎమ్మెల్యేలు గెలవడమూ వైఎస్ జగన్ కు సమస్యగా మారిందనే చెప్పాలి. ఎమ్మెల్యే మధ్య సఖ్యత లేదు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని అనేక జిల్లాల్లో వైసీపీ నేతలే ఒకరికొకరు శత్రువులుగా మారిన పరిస్థితి. దీంతో అనేక జిల్లాల్లో పార్టీ క్యాడర్ అయోమయంలో పడిపోయింది. నేతత మధ్య విభేదాలు పార్టీ పరువును బజారున పడేస్తున్నాయి.వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీని పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలో పాలనను గాడిలో పెట్టడం, మ్యానిఫేస్టోలో, పాదయాత్రలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను అమలుపర్చేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అనేక పథకాలు ఇప్పటికే వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. వచ్చే నెలలో మరిన్ని ఆకర్షణీయ పథకాలు గ్రౌండ్ కాబోతున్నాయి. దీంతో ఆయన ప్రజా సమస్యల పై ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తోంది. అందుకనే ఆయన పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు.పార్టీలో వైఎస్ జగన్ తర్వాత కొద్దోగొప్పో సీనియర్ నేతలయినా కాని, జగన్ వద్ద గ్రిప్ ఉన్న నేతలు అతి కొద్దిమందే. వారిలో విజయసాయిరెడ్డి, వైవీసుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు ఉన్నారు. వీరంతా తమ పనుల్లో బిజీగా మారిపోయారు. విజయసాయిరెడ్డి హస్తినలోనే ఎక్కువగా ఉంటున్నారు. వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వడంతో ఆయన పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పార్టీని లైట్ గానే తీసుకున్నట్లు కన్పిస్తుంది. ఇక జిల్లా ఇన్ ఛార్జి మంత్రులు ఏమైనా పార్టీ విషయాలు పట్టించుకుంటారంటే అది అత్యాశే అవుతుంది.దీంతో అనేక జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సమన్వయం కొరవడింది. విశాఖ జిల్లాలో అవంతి శ్రీనివాస్ అంటేనే వైసీపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. అనంతపురంలో నారాయణస్వామి అంటేనే కొందరు ఎమ్మెల్యేలు మండి పడుతున్నారు. ఆయన వద్దకు కూడా వెళ్లడం లేదు. ఇక తాజాగా చిలకలూరి పేట, తాడికొండ ఎమ్మెల్యే విడదల రజనీ, తాటికొండ శ్రీదేవిల మధ్య విభేదాలు తలెత్తాయి. ఒకరి నియోజకవర్గం పరిధిలో మరొకరు వేలుపెట్టడమే ఇందుకు కారణం. ఇక ఎంపీలు కూడాకొందరు ఎమ్మెల్యేల వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీలోనే అంతర్గత విభేదాలు తీవ్రతరమవుతున్నాయి. దీన్ని సకాలంలో సరిద్దిక పోతే జగన్ మున్ముందు సమస్యలు తప్పవు.