అంతరపంటగా బొప్పాయి
నల్గొండ, సెప్టెంబర్ 26,
త్తి, మిర్చి వంటి వాణిజ్య పంటలు దెబ్బతిని గత కొన్నేళ్లుగా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి కూరగాయలు, పండ్లతోటలు సాగు చేస్తున్నారు. బొప్పాయి తోటల సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతోంది. సాగునీటి ప్రాజెక్టులు లేని ప్రాంతాల్లో సైతం బిందు సేద్యం, మల్చింగ్ వంటి ఆధునిక విధానాలు అవలంబిస్తూ ఈ పంటను పండిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులకు ఇంటి వద్దే విక్రయిస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ఏడాది పొడువునా లభించే బొప్పాయిలో శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలుండే ఈ పండును ‘దేవదూత’ గా పిలుస్తారు.రుచిగా ఉండటంతో పాటు అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, మిటమిన్-ఎ, సి, ఈ, ప్లేవనాయిడ్స్, మినరల్స్, పొటాషియం, కాపర్, మెగ్నీషియం వంటి పోషకాలతో పాటు తగిన పీచు పదార్థం ఉంటుంది. శరీర బరువును తగ్గించుకునేందుకు క్యాన్సర్, గుండె వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు బొప్పాయి తోడ్పడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మధుమేహ సమస్యను, ఒత్తిడిని తగ్గించడంతో పాటు, కంటిచూపును సంరక్షిస్తుంది. బొప్పాయి పండుతో పాటు, ఆకులను అనేక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వినియోగిస్తారు.మిర్చి, పత్తి వంటి పంటలతో పోలిస్తే బొప్పాయి సాగుకు ఖర్చు తక్కువగా ఉంటోంది. కూలీల అవసరం పెద్దగా లేకుండానే పంట చేతికి వస్తుంది. ఎకరాకు వెయ్యి మొక్కలు నాటుకోవాలి. పద్నాలుగు నెలల పాటు ఉండే ఈ పంటను జూన్‌లో సాగు చేస్తే జనవరి నాటికి పంట చేతికి వస్తుంది. పంటకు నీరు ఎక్కువగా కావలసి ఉంటుంది. బిందు సేద్యం, మల్చింగ్, వల్ల నీటి సమస్య తగ్గి, ఎరువుల ఖర్చు తగ్గుతుంది. వైరస్, తుఫానులు వంటి సమస్యలు మినహా పంట సాగులో ఇబ్బందులు లేవు. పంటపై ఒక వ్యక్తి నిరంతర పర్యవేక్షణ అవసరం.బొప్పాయికి మార్కెటింగ్ సమస్య లేదు. పంట సమయంలో ఢిల్లీ, కోల్‌కతా, ముంబాయి, బెంగళూరు, భువనేశ్వర్ వంటి ప్రాంతాల నుంచి వ్యాపారులు వస్తున్నారు. కూలీలతో వారే కాయలు కోయించుకుని ప్యాకింగ్ చేసుకుని వెళ్తున్నారు. ఇతర పట్టణాల్లో ఖమ్మం నగరంతో పాటు ఇతర పట్టణాల్లో చిరు వ్యాపారులు సైతం తోటలు వద్దకు వచ్చి పండ్లు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం టన్నుకు కనీసం రూ. 7వేలు వస్తోంది. గతేడాది ఒక దశలో టన్ను రూ. 25వేల ధర పలుకుతుంది.బొప్పాయి పంట చేతికి వచ్చే సమయంలో ఎక్కువగా ఉండటంతో కొందరు అంతర పంటలు సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. బొప్పాయి మొక్క చిన్నగా ఉన్నప్పుడు బంతిపూలు, టమాట, తీగజాతి కూరగాయలు, పుచ్చవంటి పంటలను సాగు చేస్తూ.. మరి కొందరు అంతరపంటగా మునగ కూడా నాటుతున్నారు. తద్వారా పెట్టుబడికి కావలసిన ఆదాయం పొందుతున్నారు.