YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

రాడార్ స్టేషన్ కోసం ముందుకు అడుగులు

రాడార్ స్టేషన్ కోసం ముందుకు అడుగులు

రాడార్ స్టేషన్ కోసం ముందుకు అడుగులు
రంగారెడ్డి,
ఫ్రీక్వెన్సీ రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటుతో జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తుందనుకున్న ఈ ప్రాంత ప్రజల ఆశలు నెరవేరడం లేదు. 2011– 12 సంవత్సరంలో ఈ ప్రక్రియ ప్రారంభం కాగా.. ప్రాజెక్టు ఏర్పాటుపై 2014లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ అంచనాకు వచ్చాయి. దీంతో నేవీ ఏర్పాటు చేయనున్న లో ఫ్రీక్వెన్సీ రాడార్‌ వ్యవస్థకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయనే సంకేతాలు వెలువడ్డాయి. ఇది ఏర్పాటైతే  ప్రపంచంలోనే ఐదో అధునాతన వ్యవస్థకు పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతం కేరాఫ్‌గా నిలిచేది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంతో ఏర్పడి, పూర్తిగా వెనుకబడిన జిల్లాగా చర్చ జరుగుతున్న వికారాబాద్‌కు ఇలాంటి ప్రాజెక్టు రావడం అదృష్టంగా కనిపించింది. ఇది సాకారమైతే పూడూరు, పరిగి, వికారాబాద్‌ మండలాలకు చెందిన 10 గ్రామాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేకూరేది.హైదరాబాద్‌ నుంచి సరిగ్గా 60 కిలోమీటర్ల దూరంతో పాటు సముద్ర మట్టానికి 350 మీటర్ల ఎతైన ప్రాంతంలో రాడార్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఇండియన్‌ నేవీ నిర్ణయించింది. రూ.1,900 కోట్లతో ఈ ప్రాజెక్టును రూపొందించేందుకు సిద్ధమైంది. పూడూరు మండల పరిధిలోని దామగుండ అటవీ ప్రాంతంలో ఉన్న 2,700 ఎకరాల భూమిని గతంలోనే గుర్తించిన ఆ విభాగం 2011– 12 సమయంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ముందుంచింది. ఈ భూభాగం రిజర్వ్‌ ఫారెస్టుకు సంబంధించినది కావడంతో పాటు అక్కడ పురాతన దామగుండ రామలింగేశ్వరస్వామి ఆలయం ఉండటంతో పలు అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో సదరు భూమిని స్వాధీనం చేసుకునేందుకు రిజర్వ్‌ ఫారెస్టుకు రూ.133 కోట్లు చెల్లిస్తామని నేవీ అధికారులు హామీ ఇచ్చారు.దీంతో ఈ భూములను అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇదే సమయంలో 400 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన దేవాలయాన్ని యథాతథంగా ఉంచడంతో పాటు పూడూరు సమీపంలో రూ.5 కోట్లు వెచ్చించి అలాంటి ఆలయాన్నే నిర్మించి ఇస్తామని నేవీ అధికారులు హామీ ఇచ్చారు. అయితే దామగుండం భూములను నేవీకి అప్పగించాలంటే తమకు హైదరాబాద్‌లోని బైసన్‌ పోలో గ్రౌండ్‌ స్థలాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం మెలికపెట్టింది. ఇందుకు నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం.. సదరు స్థలం భారత ఆర్మీ పరిధిలో ఉందని, దీనిపై తాము నిర్ణయం తీసుకోలేమని తెలిపింది. ఈ సమాధానంతో సంతృప్తి చెందని రాష్ట్ర ప్రభుత్వం.. దామగుండం భూములను నేవీకి అప్పగించే విషయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది.రెండు రోజుల క్రితం ప్రతిపక్షనేత భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తారు. డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిసి ఈ విషయాన్ని విన్నవించారు. దీనిపై స్పందించిన సీఎం ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటు అంశం మరోసారి జిల్లాలో చర్చనీయాంశమైంది.

Related Posts