సుజనా యూ టర్న్ వెనుక....
న్యూఢిల్లీ,
కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి చిన్నగా సెట్ చేసుకుంటున్నట్లుంది. భారతీయ జనతా పార్టీలోకి వెళ్లిన ఆయన తొలినాళ్లలో జగన్ ప్రభుత్వంపై దూకుడు ప్రదర్శించారు. భారతీయ జనతా పార్టీ నేతలు అనేక మంది సుజనా చౌదరిపై అధినాయకత్వానికి ఫిర్యాదు కూడా చేశారు. చిన్న విషయానికి కూడా సుజనా చౌదరి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారని, చంద్రబాబు చేస్తున్న విమర్శలనే ఆయన చేస్తూ బీజేపీని టీడీపీ గొంతుకలా మార్చాలని కొందరు నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.దీంతో అధినాయకత్వం ఏపీ రాజకీయాల్లో జీవీఎల్ నరసింహారావును రంగంలోకి దించినట్లు పార్టీలో టాక్ విన్పిస్తుంది.అందుకే సుజనా చౌదరి చంద్రబాబుపైన కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబుకు, సుజనా చౌదరికి ఉన్న సంబంధం విడదీయలేనిది. ఎన్నటికీ విడిపోదు కూడా. సుజనా చౌదరి తన కేసుల కోసమే భారతీయ జనతా పార్టీలోకి వెళ్లారన్నది కాదనలేని వాస్తవం. ఆయన బీజేపీలోకి వెళ్లిన మూడు నెలల నుంచి ఆ కేసులన్నీ పెండింగ్ లో పడిపోయాయి. బిందాస్ గా ఉంటున్నారు. వ్యాపార సంస్థలు కూడా ఆర్థికంగా నష్టాల్లో ఉండటంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి వెళ్లారు కాని లేకుంటే చంద్రబాబు కుడి భుజంగా ఉండేవారన్నది అందరూ అంగీకరించేదే.ఇక తాజాగా సుజనా చౌదరి చంద్రబాబుపై విమర్శలు కురిపించడం బీజేపీ పెద్దల తలంటేనన్నది సమాచారం. చంద్రబాబుకు మేలు చేకూర్చేలా వ్యాఖ్యలు చేయకూడదని బీజేపీ అధిష్టానం కొంచెం గట్టిగానే సుజనా చౌదరికి చెప్పినట్లు తెలుస్తోంది. రాజ్యసభ లో తమ అవసరాల దృష్ట్యా సుజనా చౌదరి బృందాన్ని చేర్చుకున్నారన్నది ఇప్పటికీ బీజేపీలో విన్పించే మాటే. అలాంటి సుజనా చౌదరి కేవలం వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తుండటం బీజేపీలోని ఒకవర్గానికి సుతారమూ నచ్చకుండా పోయింది. రాజ్యసభ సభ్యుడి హోదాలో జిల్లాలను పర్యటిస్తూ సుజనా చౌదరి పార్టీ కార్యక్రమాల్లోనూ జగన్ ను వదలిపెట్టకపోవడంపై కొందరు మండిపడుతున్నారు. సుజనా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలోనే సుజనా చౌదరి చంద్రబాబు ఇంటిపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. కృష్ణా నది కరకట్టపై నివాసం ఉంటున్న చంద్రబాబు అది అక్రమ కట్టడం అని ప్రభుత్వం తేల్చినప్పుడు అక్కడ ఉండాల్సిన అవసరమేముందని సుజనా చౌదరి ప్రశ్నించారు. తానైతే ఆ ఇంట్లోనే ఉండేవాడిని కాదన్నారు. చంద్రబాబు ఆ ఇంటిని కూల్చి వేస్తే సానుభూతి దొరుకుతుందనే ఇల్లు ఖాళీచేయడం లేదని సుజనాచౌదరి చంద్రబాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు పనిలో పనిగా జగన్ పై కూడా విమర్శలు చేశారు. బీజేపీ అధిష్టానం అక్షింతలు సుజనా చౌదరిపై బాగానే పనిచేసినట్లుంది.