జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం.. షబ్మాన్, హర్విక్ విజృంభణ.. అజేయంగా లక్ష్య ఛేదన
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా మూడోసారి విజయం సాధించింది. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి దూకుడు మీదున్న భారత్.. శుక్రవారం జింబాబ్వేతో జరిగిన గ్రూపు-బి మ్యాచ్‌లో కూడా అదే దూకుడును ప్రదర్శించింది. 10 వికెట్ల తేడాతో జింబాబ్వేపై భారత్ ఘనవిజయం సాధించింది. భారత ఓపెనర్లు హర్విక్ దేశాయ్ (73 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్స్)తో 56 పరుగులు సాధించగా, శుభ్‌మాన్ గిల్ (59 బంతుల్లో 13 ఫోర్లు, 1సిక్స్) 90 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో 21.4 ఓవర్లలో ఒక వికెట్ కూడా నష్టపోకుండా జింబాబ్వే నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది.
ఫలితంగా టోర్నీలో వరుసగా మూడో విజయం సాధించిన భారత్.. గ్రూపు-బి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. శుభ్‌మాన్ గిల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవడంతో టీమిండియా ఖాతాలో 6 పాయింట్లు వచ్చి చేరాయి. తరువాత స్థానాల్లో ఆస్ట్రేలియా రెండో స్థానం, జింబాబ్వే మూడో స్థానంలో నిలిచాయి. కాగా, అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే 48.1 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది.