లోకేష్ పై ఆశలు గల్లంతేనా
విజయవాడ,
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఏం చేస్తున్నారు? ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా కన్పిస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నించడం లేదు. నారా లోకేష్ ఇంకా ఓటమి షాక్ నుంచి తేరుకోలేదు. కేవలం ట్విట్టర్లకే పరిమితమవుతున్నారు. ఎన్నికల ముందు వరకూ, ప్రచారంలోనూ అన్ని జిల్లాల్లో పర్యటించిన నారాలోకేష్ ఇప్పుడు మాత్రం పెద్దగా జిల్లాలను పర్యటించలేదు. ఇందుకు కారణం కూడా లేకపోలేదంటున్నారు. గత కొన్నాళ్లుగా నారా లోకేష్ పెద్దగా బయట కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కేవలం పార్టీ కార్యాలయానికే పరిమితమయ్యారు.
గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అన్ని జిల్లాలూ తిరిగే వారు. అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ నేతలతో కూడా చర్చించేవారు. సమీక్షలు జరిపేవారు. లోకేష్ జిల్లా పర్యటనకు వస్తున్నారంటే సీఎం వస్తున్నట్లే పార్టీ నేతలు భావించేవారు. భావినేత కావడంతో నారా లోకేష్ దృష్టిలో పడటానికి సీనియర్ నేతలు సయితం ప్రయత్నించేవారు. అది టిక్కెట్ కోసం కావచ్చు. లేకుంటే మళ్లీ అధికారంలోకి వస్తే పదవులకోసమైనా కావచ్చు. యువరాజు వస్తున్నంత హడావడి చేసేవారు నేతలు.ఎన్నికలు ముగిసి పార్టీ ఘోర పరాజయం పాలయిన తర్వాత నారా లోకేష్ కేవలం తూర్పు, పశ్చిమ, విశాఖ జిల్లాల్లోనే పర్యటించారు. అది కూడా కొన్ని సమస్యలపైన ఆయన ఆ కార్యక్రమాలకు హాజరయ్యారు. విశాఖలో మాత్రం అయ్యన్న పాత్రుడు పుట్టినరోజు కార్యక్రమం కోసం హాజరయ్యారు. కానీ ఈ మూడు జిల్లాల పర్యటనల్లో నేతలు నారా లోకేష్ ను పెద్దగా పట్టించుకోలేదట. పశ్చిమ గోదావరి జిల్లాలో రామానాయుడు, తూర్పు గోదావరి జిల్లాలో చినరాజప్ప, విశాఖపట్నంలో అయ్యన్న పాత్రుడు తప్ప మిగిలిన నేతలు లోకేష్ పర్యటనలకు దూరంగా ఉన్నారు. చినబాబు వచ్చిన లైట్ తీసుకోవడంతో నారా లోకేష్ కొందరు నేతలు రాకపోవడం గురించి ప్రస్తావించారు.ఇప్పటికే అన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జిల్లాకు ఒకరిద్దరు నేతలు మినహా అందరూ దూరమయిపోయారు. పార్టీ అధినేత చంద్రబాబు ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. కోడెల ఆత్మహత్య, టీడీపీ నేతలపై అక్రమ కేసులు వంటి వాటిపై ఆయన పార్టీ తరుపున ఆందోళన చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలు పర్యటించి పార్టీని గాడిన పెట్టాల్సిన భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ ట్విట్టర్ కే పరిమతమవ్వడంపై పార్టీ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. నారా లోకేష్ వల్లే పార్టీ ఓటమి పాలయిందన్న అభిప్రాయం చాలా మంది టీడీపీ నేతలు, ఓటమి పాలయిన అభ్యర్థుల్లో ఉండటంతో ఆయన జిల్లాల పర్యటనకు దూరంగా ఉన్నారన్న టాక్ కూడా ఉంది.