YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

వైసీపీలోకి పంచకర్ల

వైసీపీలోకి పంచకర్ల

వైసీపీలోకి పంచకర్ల
విశాఖపట్టణం, 
విశాఖ జిల్లాపై వైసీపీ కన్నేసింది. పట్టు పెంచుకోవడానికి అన్ని దారులు వెతుకుతోంది. టీడీపీకి బలమున్న ప్రాంతాలను, నేతలను ఏరివేసే కార్యక్రమం దూకుడుగా సాగిస్తోంది. నిన్నటి వరకూ సైకిల్ పార్టీలో కింగుల్లా బతికిన లీడర్లను వైసీపీ వైపు తిప్పేసుకుంటోంది. ఆ విధంగా చేయడం ద్వారా జిల్లాలో పసుపు పార్టీకి ఉనికి లేకుండా చేయాలన్నది వైసీపీ టార్గెట్ గా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా విశాఖ జిల్లా టీడీపీ ప్రెసిడెంటే జెండా ఎత్తేసి ఫ్యాన్ పార్టీ నీడకు చేరడం పరాకాష్టగా చెప్పుకోవాలి. రెండు మార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం రూరల్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న పంచకర్ల రమేష్ బాబుని వైసీపీలోకి లాగేసే ప్రక్రియ దాదాపుగా పూర్తి అయిందని అంటున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది.ప్రజారాజ్యం పార్టీ తరఫున రాజకీయ అరంగేట్రం చేసిన పంచకర్ల రమేష్ బాబు బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడు. ఆయన 2009లో పెందుర్తి నుంచి అప్పటి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గండి బాబ్జీతో పాటు, టీడీపీకి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని ఓడించి మరీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 ఎన్నికల నాటికి ఆయన సైకిలెక్కేశారు. ఈసారి ఆయన ఎలమంచిలి నుంచి పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికలకు ముందే ఆయన వైసీపీలో చేరాల్సి ఉన్నా కోరుకున్న విశాఖ ఉత్తరం సీటు ఇవ్వకపోవడంతో రాలేకపోయారు. ఇక ఎన్నికల తరువాత ఆయన వైసీపీలో చేరుతారని ప్రచారం సాగింది. ఇదే సమయంలో ఆయనతో బీజేపీ నేతలు కూడా చర్చలు జరిపారు. ఆయన కమలం కండువా కప్పుకుంటారని కూడా అనుకున్నారు. కానీ చివరకు వైసీపీలో డీల్ కుదిరింది. ఆయన వైసీపీలోకి వచ్చేస్తున్నారని అంటున్నారు. ఈ పరిణామం టీడీపీకి అతి పెద్ద దెబ్బగానే చూడాలి.ఇక పంచకర్ల రమేష్ బాబు దసరా తరువాత వైసీపీలో చేరుతారని అంటున్నారు. ఆయన రాకను ఈసరికే సీఎం జగన్ ఆమోదించారని అంటున్నారు. పార్టీలో ఆయనకు సముచిత గౌరవంతో పాటు, భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్టోబర్లో జగన్ విశాఖ జిల్లా టూర్ ఉంటుందని, అపుడు ఆయన వైసీపీలో చేరుతారని అంటున్నారు. ఇదిలా ఉండగా పంచకర్లతో పాటు అనేక మంది టీడీపీ నేతలు కూడా పార్టీని వీడుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద చూసుకుంటే విశాఖ జిల్లాలో ఆపరేషన్ టీడీపీ విషయంలో వైసీపీ బాగానే సక్సెస్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

Related Posts