చింతమనేని చింతలు తీరేలే లేవు...
ఏలూరు,
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ చింతమనేని ప్రభాకర్ చింతలు ఇప్పట్లో తీరేలా లేవు. ఇటీవల ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దీంతో ఆయన ఇంటి నుంచి కొన్ని రోజుల పాటు తప్పించుకుని, అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే, కింద పడ్డా పైచేయి తనదేనని వాదించే నాయకుల్లో చింతమనేని ప్రభాకర్ ఒకరు. ఆయన దూకుడు స్వభావమే ఆయనను నిలువునా ముంచేస్తోంది. అలానే అజ్ఞాతంలో ఉండి, బెయిల్ కోసం ప్రయత్నించి ఉంటే వేరేగా ఉండేది. కానీ, ఇంతలోనే వైసీపీ కీలక నేత, మంత్రి బొత్స సత్యనారాయణ చింతమనేని ప్రభాకర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.“ఆయన తప్పు చేశాడు.. కాబట్టే తప్పించుకుని తిరుగుతున్నాడు“ అని వ్యాఖ్యానించారు. దీంతో చింతమనేని ప్రభాకర్ ఠాట్..నేను తప్పించుకు తిరగడం ఏంటి.. అంటూ .. నేరుగా వచ్చి పోలీసులకు లొంగిపోవాలని అను కున్నారు. విషయం తెలిసిన పోలీసులు తామే రంగంలోకి దిగి.. దారి మధ్యలోనే చింతమనేని ప్రభాకర్ ని అడ్డగించి.. అరెస్టు చేసి కోర్టుకు తరలించడం, ఆ వెంటనే ఆయనను జైలుకు పంపించడం తెలిసిందే. సరే! చచ్చీ చెడీ.. చింతమనేని ప్రభాకర్ బెయిల్ తెచ్చుకున్నారు. అయితే, ఇంతలోనే ఆయనను పోలీసులను నిర్బంధించిన కేసులో మరోసారి అరెస్టు చేశారు. దీంతో మళ్లీ చింతమనేని ప్రభాకర్ జైలుకు వెళ్లక తప్పలేదు. ఈ క్రమంలోనే ఆయనను అరెస్టు కాకుండా చూసేందుకు ప్రయత్నించిన లాయర్లు కూడా కేసులు ఎదుర్కొంటున్నారు. చింతమనేని ప్రభాకర్ ఇక బయటకు రాడా? అనే సందేహాలు తెరమీదికి వస్తున్నాయి. రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు, ప్రత్యర్థుల నుంచి బెదిరింపులు కామనే. అయితే, వీటికి అతీతంగా తనను తాను మలుచుకుని, తానే కేంద్రంగా చక్రం తిప్పాలనే విషయంలో చింతమనేని ప్రభాకర్ కోరి కోరి సమస్యలు తెచ్చుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా ఆయన కొన్ని అభివృద్ధి పనులు చేసిన మాజీ ఎమ్మెల్యేనే కావొచ్చు.. కానీ, తన వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా చేసిన కొన్ని చర్యలు చింతమనేని ప్రభాకర్ ను ఇప్పుడు బోను ఎక్కించాయి. ఈ నేపథ్యంలో మరో కేసును కూడా ఇప్పటికే పోలీసులు సిద్ధం చేశారు.ఒకవేళ ఇప్పుడున్న కేసులోనూ చింతమనేని ప్రభాకర్ బెయిల్‌పై బయటకు వస్తే.. అప్పుడెప్పుడో జరిగిన భూకబ్జాకు సంబంధించిన కేసులో మరోసారి అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఇప్పట్లో చింతమనేని బయటకు వచ్చే ఛాన్స్ లేదని ఆయనకు అప్పటి వరకు జైలే గతని అంటున్నారు. మొత్తం చింతమనేనిపై 62 కేసులు నమోదై ఉన్నట్టు పోలీసులు చెపుతున్నారు. దీంతో ఇప్పుడు చింతమనేని పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడినట్లయ్యింది. ఇక రాజకీయంగా కూడా సొంత పార్టీ నుంచి ఆయన్ను పట్టించుకునే వారే లేరు. పార్టీ అధిష్టానం సైతం కోడెల విషయంలో వ్యవహరించినట్టే చింతమనేనిని లైట్ తీస్కొంటోంది.