ఎస్కేయూలో వైట్ కాలర్ నేరాలు
అనంతపురం
శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాయంలో ఇంటి దొంగలు తెలివిగా తప్పించుకుపోతున్నారు. ఇప్పటికే ఎంతో విలువైన ఉపకరణాలు చోరీ అయ్యాయి. ల్యాప్‌టాప్‌లు, ఎల్‌ఈడీ టీవీ వంటి వాటిని కొందరు ప్రొఫెసర్లు ఇంటికి తరలించేశారు. సెంట్రల్ లైబ్రరీకి అప్పగించాల్సిన విలువైన ప్రాజెక్ట్ పుస్తకాలను సైతం ఇళ్లకే పరిమితం చేశారు. విభాగాల నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగమవుతున్నా.. ఎస్కేయూ పాలకవర్గం పట్టించుకోకపోవడం విమర్శలు దారి తీస్తోంది. క్యాంపస్‌లోని సోషియాలజీ విభాగంలో ఇటీవల ఓ టైం స్కేలు ఉద్యోగి కంప్యూటర్, ఫర్నీచర్‌ను తరలిస్తూ పట్టుపడ్డారు. దీంతో సంబంధిత ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇలాంటి పరికరాల తరలింపు అంశంలో కఠినంగా ఉన్న ఉన్నతాధికారుల వైఖరి ప్రశంసనీయం. అయితే వైట్‌కాలర్ నేరగాళ్ల అంశంలోనూ ఉన్నతాధికారులు దృష్టి సారించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. విభాగాలకు సంబంధించిన విలువైన పరికరాలను అందుబాటులో ఉంచకుండా తరలించిన వారిపై ప్రత్యేక దృష్టిసారించి .. స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వాదన వినిపిస్తోంది. పేమెంట్ సీట్లతో వచ్చిన మొత్తాన్ని విభాగాల్లో దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ వ్యక్తిగత వాహన డ్రైవర్లకు ఇందులో నుంచే జీతాలు చెల్లించిన ప్రొఫెసర్లూ ఉన్నారు. విలువైన కెమికల్స్‌ను కొనుగోలు చేసినట్లు బిల్లులు సృష్టించి రూ.లక్షల్లో సొమ్ము చేశారంటూ స్వయంగా విద్యార్థులే ఆరోపిస్తున్నారు. సైన్స్ విభాగాల్లో వివిధ ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తున్నారు. మొదట వచ్చిన ప్రాజెక్ట్‌కు సంబంధించిన పరికరాలను.. రెండో ప్రాజెక్ట్‌కూ చూపించి రూ.లక్షల్లో బిల్లులు నొక్కేస్తున్నారు. ఫిజకల్ వెరిఫికేషన్ లేకపోవడంతో ఈ తరహా అక్రమాలకు తెరలేపారు. ఈ నేపథ్యంలో ఫిజికల్ వెరిఫికేషన్ ఆడిట్ చేయిస్తే లక్షలాది రూపాయల వర్సిటీ పరికరాలు రికవరీ అయ్యే అవకాశం ఉంది. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో మొత్తం 30 విభాగాలు ఉన్నాయి. ఇందులో పేమెంట్ సీట్ల పేరుతో ఆయా కోర్సుల్లో ప్రత్యేకంగా అడ్మిషన్లు కల్పిస్తుంటారు. వీటికి సంబంధించిన ఫీజు మొత్తాన్ని ఆయా విభాగాల్లో అవసరమైన పరికరాల కొనుగోలుకు వెచ్చించాలి. అన్ని విభాగాల్లోనూ ప్రత్యేకంగా ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేశారు. అయితే ఏ ఒక్క విభాగంలోనూ ఈ ల్యాప్‌టాప్‌లు కనిపించవు! మొత్తం ల్యాప్‌టాప్‌లను ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఇళ్లకు తీసుకెళ్లినట్లు ఆరోపణలున్నాయి. తరగతి గదిలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు వినియోగించాల్సిన ల్యాప్‌టాప్‌లను మాయం చేసిన వైట్‌కాలర్ దొంగలపై నేటి వరకూ ఎలాంటి చర్యలూ లేవు. సైన్స్ విభాగాల్లో ప్రొజెక్టర్లు, ఎల్‌ఈడీ టీవీ, డెస్క్‌టాప్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసి విభాగాల్లో అందుబాటులో ఉంచకుండా మాయం చేయడమూ వివాదస్పదమవుతోంది. ఒక్కసారి కొనుగోలు చేసిన విలువైన పరికరాలను పదే పదే చూపిస్తూ బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉపకరణాలను భద్రపరచడానికి సెంట్రల్ స్టోర్‌ను ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు. విభాగాల్లో కొనుగోలు చేసిన పరికరాలు, వినియోగిస్తున్న పరికరాలను ఎప్పటికపుడు నమోదు చేయడం లేదు. సైన్స్ విభాగాల్లో గణనీయంగా ప్రాజెక్ట్‌లు నిర్వహిస్తున్నారు. ఒక్కో ప్రాజెక్ట్‌లో లక్షలాది రూపాయలను వెచ్చించి పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రాజెక్ట్ గడువు పూర్తి అయిన తరువాత పుస్తకాలను సెంట్రల్ లైబ్రరీకి అప్పగించాలి. కానీ ఆ పుస్తకాలను అప్పగించకుండా తరలించేశారు. ఎస్కేయూ పాలక వర్గం ఇప్పటికైనా స్పందించి వైట్‌కాలర్ దొంగలపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.