ఆదివారం నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు - సర్వాంగ సుందరంగా శివాలయం
వనపర్తి
మండల కేంద్రమైన గోపాల్ పేట లో వెలసిన శివాలయంలో ఈ నెల 29 నుంచి అక్టోబర్ 8 వరకు 23వ సంవత్సర శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నది.సుమారు 500 సంవత్సరాల క్రితం పాండవుల వంశీయులైన
జనమేజయ మహారాజు ఈ శివాలయాన్ని నిర్మించారని పండితులు చెప్పుకుంటారు. అందుకు నిదర్శనమే గోపాల్ పేట లోని శివ కేశవాలయలేనని వారంటున్నారు. జనమేజయ మహారాజు ఎక్కడ ఆలయాలను నిర్మించిన అక్కడ కేశవాలయం , శివాలయాలు నిర్మిస్తూ వాటి మధ్యన పుష్కరిణినీ నిర్మిస్తారని, అదేవిధంగా గోపాల్ పేట్ లో నిర్మించారని వారు
చెప్పుకుంటారు. ఎంతో భక్తి భావంతో వెలుగొందుతున్న శివాలయం లో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 29న వైభవంగా పూజలు ప్రారంభమయ్యాయి అక్టోబర్ 8 వరకు వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 8న విజయదశమి నాడు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి గా అలంకరించి పూజలను నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 7 గంటలకు ఆలయ ప్రాంగణంలో
భక్తుల సమక్షంలో శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ ఓ ప్రకటనలో తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాలకు భక్తుల సౌకర్యార్థం ఆలయంలో అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశామని, శరన్నవరాత్రి ఉత్సవాలలో పది రోజుల పాటు ఒక్కరోజు ఒక పూజా విధానం తో పాటు ప్రతిరోజు అమ్మవారిని ఒక్కొక్క రూపంలో
అలంకరించి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి పూజలు నిర్వహిస్తామని వారు తెలిపారు. అలాగే శరన్నవరాత్రి ఉత్సవాల లో ప్రతిరోజు రాత్రి పూజలతో పాటు భజనలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని,ఈ పూజలు అన్నింటిని ఆలయ అర్చకులు గంటా మఠం మహేశ్వర స్వామి, గంటా మఠం గిరిజాస్వామి లు నిర్వహిస్తారని వారు తెలిపారు.