YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు.?

Highlights

  • ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ 
  • దైవాన్ని దర్శించడమే దైవ సాక్షాత్కారం
  •  ‘అహం బ్రహ్మాస్మి’ అంటే. 
  • నిన్ను నీలోనే దర్శించుకోవడమే
దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు.?

ఈ సృష్టి మొత్తం వ్యాపించి వుండి, దాని ఉత్పత్తి, పెంపు, లయములకు ఎవరు కారణమవు తున్నారో…, అతనినే ‘దేవుడు’ అని అన్నారు మన ఋషులు. మరి ఆ దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు…అనే సందేహం మనలో చాలా మందికి కలగవచ్చు. నిజాన్ని పరిశీలిస్తే… పాంచభౌతికమైన మన శరీర అవయవాలకు వున్న శక్తి చాలా పరిమితం. 
ఉదాహరణకు..
మన కాళ్ళు…ఈ విశ్వాన్ని మొత్తం నడచి రాలేవు. వాటికి అంత శక్తి లేదు.
మన చేతులు..కైలాస పర్వతాన్ని ఎత్తిపట్టుకుని మోయలేవు. వాటికి అంత శక్తి లేదు.
మన కళ్ళు…అతి విసృతమైన పదార్ధాన్నిగానీ.. అతి సూ‌క్ష్మమైన పదార్ధాన్నిగానీ… చూడలేవు. వాటికి అంత శక్తి లేదు.
ఆకాశం మన కంటికి కనిపించదు. చూస్తున్నామని అనుకోవడం మన భ్రమ. అతి సూక్ష్మక్రిమి అయిన ‘అమీబా’ని సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) సాయంతో చూస్తున్నాం కదా అని మీరు అడగవచ్చు. మన కళ్ళకు అంత శక్తి లేదు కనుకనే… మనం సూక్ష్మదర్శినిని ఆశ్రయించవలసి వస్తుంది.
మరి ఈ కళ్ళతో ‘దేవుని’ చూచిన ఋషులు వున్నారుకదా..అని మీరు అడగవచ్చు.
కళ్ళు భౌతికమైన పదార్ధాలను మాత్రమే చూడగలవు.
మనోనేత్రం అభౌతికమైన పదార్ధాలను దర్శిస్తాయి.
‘దేవుడు’ మనోనేత్రానికి దర్శనమిస్తాడు. తను సంకల్పించినప్పుడు మాత్రం మన భౌతిక నేత్రాల ముందు ప్రత్యక్షమౌతాడు. చూడడానికి, దర్శించడానికి ఉన్న తేడా అది.
మరి మనోనేత్రంతో ‘దేవుని’ దర్శించడం ఎలా? అన్నదే ఈనాటి మన ప్రశ్న.
పంచభూతాల శక్తుల సమ్మిళితమే…భూలోక జీవుల శరీర నిర్మాణం. అందుకే… ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూంటాయి. పంచభూతాల తత్త్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకూ…,వాటికి అతీతంగా ఉండే ‘పరమాత్మ’ మన కళ్ళకు దర్శనమివ్వడు. ఆ దేవదేవుని దర్శించాలంటే…పంచభూత తత్త్వాలనూ, వాటి గుణాలనూ, త్యజించాలి. ఏమిటి వాటి గుణాలు, తత్త్వాలు…అంటే….
ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం.
వాయువుకు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ.
అగ్నికి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు.
జలముకు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.
భూమికి ఉన్న గుణాలు ఐదు…శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు.
ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.
జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.
అగ్ని…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.
వాయువు…‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.
ఆకాశం…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.

కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు, ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే…, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే. ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే. అదే దైవ సాక్షాత్కారం అంటే.

Related Posts