YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

విత్తనమే విఘ్నం (నెల్లూరు)

విత్తనమే విఘ్నం (నెల్లూరు)

విత్తనమే విఘ్నం (నెల్లూరు)
నెల్లూరు,

 వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భూములు పదునయ్యాయి. ఈనేపథ్యంలో వరి సాగుకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు విత్తనాల సేకరణకు అన్నదాతలు పరుగులు తీస్తున్నారు. అధికారులేమో మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో విత్తనాలు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులు దీన్ని అవకాశంగా తీసుకొని నాసిరకం విత్తనాలు సరఫరా చేస్తున్నారు. వీటిని తీసుకొని సాగుచేసి నష్టపోతున్నారు. జిల్లాలో 3.38 లక్షల హెక్టార్లలో రైతులు ఈ సీజన్‌లో వరి సాగు చేస్తారు. ఇందుకు 28 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు కావాల్సి ఉంది. కొందరు రైతులు ముందు జాగ్రత్తగా గతంలో పండిన పంటలో కొంత విత్తనాన్ని నిల్వ చేసి ప్రస్తుత సీజన్‌లో మూలవిత్తనంగా వినియోగించుకుంటున్నారు. సన్న, చిన్న కారు రైతులు అధికంగా వ్యవసాయ శాఖ, ప్రైవేటు డీలర్లపై ఆధారపడి కొనుగోలు చేస్తున్నారు. విత్తనం నాణ్యతగా ఉంటేనే దిగుబడి బాగా వస్తోంది. ఇందులో మొలక శాతం తక్కువగా ఉండి నాణ్యత లేకుంటే ఎంత పెట్టుబడి పెట్టినా అధిక దిగుబడులు సాధించడం కష్టం. ఆర్థికంగా నష్టపోవడం ఖాయం. ఏటా రైతులు పంటల సాగుకు ముందు విత్తనాలు ఎంపిక చేసుకోవడం పెద్ద సమస్యగా మారుతోంది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా వ్యవసాయ శాఖ ఇచ్చే విత్తనాల్లో మొలక శాతం తక్కువగా ఉంటోంది. ప్రైవేటు డీలర్లు కూడా రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధిక ధరలకు సీజన్‌లో విక్రయిస్తున్నారు. పైగా ఇవి నాణ్యతగా ఉండడం లేదు. దీంతో వీటిని కొనుగోలు చేసి నారు పోసినా మొలక శాతం సక్రమంగా రావడం లేదు. రెండు మూడేళ్లుగా నాయుడుపేట, సూళ్లూరుపేట వ్యవసాయ సబ్‌ డివిజన్లలో ఇదే పరిస్థితి నెలకొంది. పచ్చిరొట్ట ఎరువుల సాగుకు గత ఏడాది వ్యవసాయ శాఖ పంపిణీ చేసిన జీలుగ విత్తనాలు సరిగా మొలకెత్తకపోవడంతో రైతులు నష్టపోయారు. ఇదే తరహాలో రాయితీపై ఇచ్చిన విత్తనాలు కూడా నాణ్యత సరిగా లేవని వ్యవసాయాధికారులు తిప్పి పంపిన దాఖలాలు ఉన్నాయి.
విత్తన విక్రయ దుకాణాలపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలి. కేవలం వ్యవసాయ శాఖ ధ్రువీకరించిన విత్తన సంస్థల నుంచి అందజేసిన విత్తనాలు మాత్రమే విక్రయించే విధంగా చూడాలి. విత్తనాలు నిల్వ చేసే దుకాణాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి. పురుగు మందులు, విత్తనాలు ఒకే చోట విక్రయించకూడదు. వ్యవసాయ శాఖ అధికారులు దుకాణాల్లోని విత్తనాలను సేకరించి నాణ్యత నిర్ధారణ కేంద్రానికి పంపించి నాణ్యతగా ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలి. రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా చూడాల్సిన అవసరం ఉంది. కొద్ది రోజులుగా ఒక మాదిరి వర్షాలు కురుస్తుండడంతో వరి నారుమళ్లను రైతులు  సిద్ధం చేస్తున్నారు. ఇందుకు అవసరమైన విత్తనాలు ప్రైవేటు డీలర్లు, ఏసీ సీడ్స్‌ విక్రయ కేంద్రాల్లో లేకపోవడం సమస్యగా ఉంది. వర్షాలు కురిసి చెరువులకు నీరు చేరినప్పుడు విత్తనాలు దిగుమతి చేసుకోవచ్చన్న ధీమాగా అధికారులు ఉన్నారు. వరి విత్తనాలపై దృష్టి పెట్టకపోవడంతో రైతులు అందోళన చెందుతున్నారు. జిల్లా వ్యవసాయాధికారులు విత్తన విక్రయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 
సన్న, చిన్న కారు రైతులను ఆదుకొనేందుకు వ్యవసాయ శాఖ ఏటా బీపీటీ, ఇతర రకాల వరి విత్తనాలను కేజీపై ఐదు రూపాయల రాయితీతో ఎకరాకి 30 కేజీల చొప్పున ఐదు ఎకరాల వరకు బస్తాపై రూ.150లు రాయితీ పోను రూ.870లకు ఇస్తున్నారు.  సీజన్‌ ప్రారంభానికి ముందే ముందస్తు ప్రణాళికతో రైతులకు అవసరమైన విత్తనాలు, వ్యవసాయ శాఖ, ప్రైవేటు డీలర్లు అందుబాటులో ఉంచడం లేదు. దీంతో వర్షాలు కురిసి చెరువులకు నీరు చేరినప్పుడు హడావుడిగా నాణ్యత లేనివి దిగుమతి చేసుకుంటున్నారు. డిమాండ్‌ను అవకాశంగా తీసుకొని డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

Related Posts