ఇది కల్తీ రాజ్యం (ఆదిలాబాద్)
ఆదిలాబాద్,
జిల్లాలో కల్తీ రాజ్యమేలుతోంది. కల్తీని నియంత్రించే అధికారులు, నాణ్యతను నిర్ధరించే ల్యాబ్‌లు అందుబాటులో లేకపోవడంతో వ్యాపారులు యథేచ్ఛగా కల్తీ చేస్తూ ప్రజారోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ జరగకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆహార పరిరక్షణశాఖ అలంకార ప్రాయమైంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేలల్లో దుకాణాలు, హోటళ్లు, చిన్న, చిన్న దుకాణాలుంటే కేవలం ఒకరిద్దరు అధికారులను నియమించారు. నెలకు అయిదారు మాత్రమే సేకరించి మమ అనిపిస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన అధికారి ఉమ్మడి జిల్లాకు ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. ఏళ్ల తరబడి కొన్ని జిల్లాలకు అధికారులే లేరు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆహార పరిరక్షణ శాఖ కార్యాలయం ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది. వరంగల్ నుంచి జిల్లాకు ఆయన ఎప్పుడు వస్తారో..రారో తెలియదు. పర్యవేక్షణ అధికారి, సిబ్బంది లేకపోవడంతో ఇదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు నిత్యావసర సరుకులు, వంటనూనెలు, ప్యాకింగ్ వస్తువుల్లో కల్తీ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. అమాయక ప్రజలు వీటిని కొనుగోలు చేసి జేబు గుల్ల చేసుకోవడంతోపాటు వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. గ్రామీణ వారసంతల్లో నకిలీ, కల్తీ విక్రయాల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఉన్న కార్యాలయంలో ఫుడ్‌సేప్టీ అధికారి, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్ ఒకరు, ఇద్దరు అటెండర్లు ఉండాలి. ప్రస్తుతం ఆదిలాబాద్‌లో అటెండర్ మాత్రమే ఉన్నారు. ఆయనే ఇక్కడ అన్నీ. ఫిర్యాదులు అందిన వెంటనే నమూనాలు సేకరించి కేసులు నమోదు చేయాలి. కేసుల తీవ్రతను బట్టి ప్రథమశ్రేణి న్యాయమూర్తి, సంయుక్త పాలనాధికారి కోర్టుల్లో కేసులు దాఖలు చేయాలి. అనుమానిత పదార్థాలు, సరకులకు సంబంధించి నెలలో ఆరు నమూనాలు సేకరించాల్సి ఉంది.
వంట నూనెల్లో కల్తీ బాగా జరుగుతోంది. కొందరు వ్యాపారులు ప్యాకింగ్ నిబంధనలు ఉల్లంఘించి నాసిరకం నూనెలను ఇతర నూనెలను కలిపి సొమ్ము చేసుకుంటున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. గడువు ముగిసినవి కూడా విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి డ్రమ్ముల్లో నూనెను దిగుమతి చేసుకుని పలుచోట్ల కల్తీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. పొద్దు తిరుగుడు నూనెలో వేరుశనగ నూనె, పల్లినూనెలో పామాయిల్ కలుపుతున్నట్లు, స్వచ్ఛమైన నూనెలా వాసన వచ్చేందుకు రసాయన పదార్థాలను వినియోగిస్తున్నారు. అనుమతులు లేకుండానే తినుబండారాల విక్రయాలు జరుగుతున్నాయి. ఈ వ్యాపారం చేసేందుకు ముందస్తుగా వాణిజ్య పన్నులు, పురపాలికలు, పంచాయతీల నుంచి అనుమతి పొందాలి. ఇవేమి లేకుండానే కొందరు అల్పాహార దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణాలు, మండల కేంద్రాల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు శివారు ప్రాంతాల్లో చిరుతిండ్ల తయారీ జోరుగా సాగుతోంది. ప్యాకింగ్ నిబంధనలు పాటించకుండానే ఆకర్షణీయమైన లేబుల్స్ అంటించి చిరుతిండ్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. వీటి తయారీకి నాసిరకం సరకులను వినియోగిస్తుండడంతో పెద్దలు, పిల్లలు జీర్ణకోశ వ్యాధుల బారిన పడుతున్నారు.
పాలలో నీళ్లు, పౌడర్ కలిపి కల్తీకి పాల్పడుతున్నారు. నిల్వ ఉండడానికి రసాయనాలు కలుపుతున్నారు. కందిపప్పు, ఇతర పప్పుల్లోనూ నాసిరకం పప్పులు హానికర రంగులు కలుపుతున్నారు. చక్కెరలోనూ రవ్వ, ఫ్రైలింగ్స్, వాడేసిన టీపొడి వ్యర్థాన్ని కలుపుతున్నారు. కుడుక పొడిలో రవ్వ, మెంతి పొడిలో ఇసుకరాళ్లు, టీ, మసాల, కారం పొడి, బ్రాండెడ్ నీటి ప్యాకెట్లు, బాటిళ్లలోనూ కల్తీ జరుగుతున్నట్లుగా గతంలో గుర్తించారు. నాణ్యత ప్రమాణాలను కంపెనీల వారు పాటించకుండా ఉత్పత్తి చేస్తున్నట్లుగా గుర్తించారు. ఇటీవల హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు కల్తీ నూనెలు, నిత్యావసర సామగ్రిని భారీగా పోలీసులు పట్టుకున్నారు.