YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

గ్రామాల దగ్గరకు రాని పల్లె వెలుగులు

గ్రామాల దగ్గరకు రాని పల్లె వెలుగులు

గ్రామాల దగ్గరకు రాని పల్లె వెలుగులు
నల్గొండ, 
ఆర్టీసీ అధికారులు ఎంత ప్రచారం చేసినా...క్షేత్ర స్థాయిలో మాత్రం పల్లెవెలుగులు కానరావటం లేదు. ప్రైవేట్‌ వాహనాల్లో బడికి వెళ్లిన విద్యార్థులు సాయంత్రం క్షేమంగా ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులు కళ్లప్పగించి చూస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో బస్సులు సౌకర్యం సరిగా లేదు. విద్యాసంస్థలకు వెళ్లాలంటే ఆటోలే దిక్కు. ప్రైవేటు వాహనాల్లో పరిమితికి మించి 
విద్యార్థులను తరలిస్తుండటంతో అదుపుతప్పి ఆటోలు కిందపడుతున్నాయి. వేగంగా వచ్చే వాహనాలూ ఢీకొడుతుండటంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడుతున్నారు. చింతపల్లి మండలంలోని 20 ఉమ్మడి గ్రామ పంచాయతీల్లో చింతపల్లి, కుర్మేడ్, వెంకటేశ్వరనగర్‌ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. మిగతా 34 గ్రామాలకు చెందిన విద్యార్థులు రోజూ ఈ ప్రాంతాలకు వెళ్లి చదువుకోక తప్పని పరిస్థితి. చింతపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఆదర్శ పాఠశాల, మూడు ప్రైవేట్‌ పాఠశాలలు, ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంది. వీటిలో చదువుకునే విద్యార్థులు రోజూ ఆటోల్లో ప్రయాణిస్తూ విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. ఆర్టీసీ నిర్వాహకులు మాత్రం కేవలం మండలంలో మీదుగా వెళ్తున్న హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ రాష్ట్ర రహదారిపైనే బస్సులను నడుపుతున్నారు. చింతపల్లి మండల కేంద్రానికి రోజూ కిష్టారాయనిపల్లి, నర్సింహాపురం, రాయినిగూడెం, హరిజనపురం, ఘడియగౌరారం, వర్కాల, వింజమూరు, కుర్మపల్లి, కుర్మేడ్, మల్లారెడ్డిపల్లి, హోమంతాలపల్లి, రంగారెడ్డి జిల్లా లోని మాడ్గుల, ఆర్కపల్లితోపాటు పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు ఆటోల్లో కిక్కిరిసి ప్రయాణాలు చేస్తున్నారు. రహదారులపై ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వీరంతా రాకపోకలు సాగిస్తున్నారు. ఆటోల్లో నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులు, ప్రయాణికులను నిత్యం తరలిస్తుండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కొక్క ఆటోలో నలుగురు 
మాత్రమే ప్రయాణించాలి. తక్కువ మందిని తరలిస్తే తాము తీవ్రంగా నష్టపోతామనే ఉద్దేశంతో డ్రైవర్లు ప్రయాణికులు, విద్యార్థులను 15 నుంచి 20 మంది తీసుకెళ్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్టీసీ బస్సులు వెళ్లని గ్రామీణ ప్రాంతాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు తప్పనిసరి పరిస్థితిలో కిక్కిరిసి వెళ్తున్నారు.

Related Posts