పది రోజులు...పది ప్రసాదాలు
విజయవాడ,
జగన్మాత నవ అవతారాలను అత్యంత భక్తితో పూజించే పర్వదినాలు శరన్నవరాత్రులు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు పరమేశ్వరి తొమ్మిది రూపాలను ఆరాధిస్తారు. మహిషాసుర సంహారం కోసం అమ్మవారి ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి ఒక్కో రూపంలో యుద్ధం చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు. శక్తిస్వరూపిణి అయిన మాతకు దేవీ భాగవతంలో బ్రహ్మ ,విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తుల కన్నా అధిక ప్రాధాన్యత కల్పించారు. విజయం చేకూరాలంటే శక్తిని అందుకోవడం తప్పనిసరి.‘త్రిపురార వ్యాసం’లోని మహాత్మ్యఖంఢం శక్తి ఉపాసనా విశిష్టతను స్పష్టంగా వివరించింది. త్రిపురకు వర్తించే సర్వమంగళ నామం ‘సప్తశతీ, లలితాత్రిశతి, లలితా సహస్రనామాల్లోనూ కనపడుతుంది. ఆమే త్రిపురా రహస్యంలో వర్ణితమైన దుర్గామాత. అలాంటి దుర్గామాతకి జరిపే ఉత్సవాలే దేవీ నవరాత్రులు.తల్లిని దేవతగా పూజించడం శక్తాభావ వికాసంలోని పద్ధతి. నీవే సరస్వతి, నీవే మహాలక్ష్మి, నీవే శాకంభరి, నీవే పార్వతివి అని త్రిశక్తుల ఏకీకరణ సమన్వయాన్ని సాధించే దిశలో ఆదిశంకరాచార్యులు మహాలక్ష్మిని కనకధారా స్తోత్రంలో కీర్తించారు. వైదిక సంప్రదాయంలో దేవి త్రిమూర్తుల శక్తిగా చెప్పబడింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిలుగా కొలువుదీరి ఉంటుంది. మహాకాళిని శత్రునిర్మూలనకు, మహాలక్ష్మీని ఐశ్వర్య-సౌభాగ్య సంపదలకు, సరస్వతిని విద్య విజ్ఞానానికి అధిష్టాన దేవతలుగా భావిస్తారు. నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారిని రోజుకో రూపంలో అలకరించి, నైవేద్యాలను కూడా ఒక్కో వంటకం సమర్పిస్తారు.
అమ్మ బాలా త్రిపుర సుందరి అంటే బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. నైవేద్యంగా పులిహోర సమర్పిస్తారు.చంద్రఘంటా అంటే గాయత్రీదేవి రూపంలో అలంకరిస్తారు. నైవేద్యంగా కొబ్బరి అన్నం, పాయసం సమర్పించుకుంటారు.అన్నపూర్ణదేవిగా అలంకారంలో భక్తులను అనుగ్రహించే పరా శక్తికి మినప గారెలు, మొక్కజొన్న వడలు కూడా నైవేద్యం పెడతారు. లలితా దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తుంది. నైవేద్యంగా దద్ద్యోజనం సమర్పించుకుంటారు. మహాలక్ష్మీగా అలంకరిస్తారు. నైవేద్యంగా కేసరి నివేదిస్తారు. సరస్వతి రూపంలో జగన్మాత దర్శనమిస్తుంది. నైవేద్యంగా పరమాన్నం, అల్లం గారెలు సమర్పిస్తారు. దుర్గాదేవి రూపంలో అలంకరిస్తారు. నైవేద్యంగా శాకాన్నం లేదా కలగూర పులుసు సమర్పిస్తారు మహిషాసురమర్దినిగా అమ్మవారిని అలంకరిస్తారు. నైవేద్యంగా రవ్వతో చక్రపొంగలి, చక్కర పొంగల్ సమర్పిస్తారు.శ్రీరాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. నైవేద్యంగా సేమ్యా పాయసం, కొబ్బరి పాయసం, కొబ్బరన్నం, పరమాన్నం సమర్పిస్తారు.