జిల్లాల్లో మూసుకుపోతున్న జనసేన ఆఫీసులు
ఏలూరు,
ఏ రాజకీయ పార్టీ అధినేతకైనా తన సొంత జిల్లాలో గట్టి పట్టుంటుందనేది నానుడి. ఈ విషయంలో ఒక్క వైసీపీ అధినేత జగన్ కు మాత్రమే మేజర్ మార్కులు పడుతున్నాయి. ఆయన తన సొంత జిల్లాలో కంచుకోటను ఏర్పాటు చేసుకున్నారు. వైఎస్ హయాం నుంచి ఉన్న ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా కాపాడుకోవడంతో పాటు మరింత ఓటు బ్యాంకు ను పెంచుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. జిల్లాలో వైసీపీకి తిరుగులేకుండా చేసుకున్నారు. ఇక, రెండో స్థానంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిలిచారు. ఆయన తన సొంత జిల్లా చిత్తూరులో తన సొంత నియోజకవర్గాన్ని మూడున్నర దశాబ్దాలుగా కాపాడుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం సొంత జిల్లాలో సత్తా చాట లేకపోతున్నారు.2014లో జరిగిన ఎన్నికల్లోనూ చంద్రబాబు తన సొంత జిల్లాలో సగానికి సగం సీట్లను సాధించారు. ఈ ఎన్నికల్లో కేవలం తన కుప్పం సీటు మాత్రమే నిలబెట్టుకోగా.. మిగిలిన 13 సీట్లతో పాటు రెండు ఎంపీ సీట్లు టీడీపీ కోల్పోయింది. కానీ, ఈ ఇద్దరికి భిన్నంగా ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి అంటున్నారు విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ సొంత జిల్లా పశ్చిమ గోదావరిలో ఎక్కడా పవన్ కళ్యాణ్ ఊపు కనిపించడం లేదు. పైగా ఆయన కూడా ఘోరంగా ఓడిపోయారు. వాస్తవానికి 2009లో పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం తరఫున ఇక్కడి పాలకొల్లు నుంచి పోటీ చేశారు. అయితే, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఓ మహిళా నాయకురాలి చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా తమ సొంత జిల్లాలో పావులు కదపాలని.. పట్టు సాధించాలని అనుకున్న పవన్ కళ్యాణ్ పాలకొల్లు పక్కనే ఉన్న భీమవరం నుంచి పోటీ చేశారు.అంతేకాదు, పవన్ కళ్యాణ్ సోదరుడు, మెగా బ్రదర్ నాగబాబును నరసాపురం ఎంపీగా పోటీచేయించారు. అయితే, ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఇద్దరూ చిత్తుగా ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ గాజువాకతో పాటు భీమవరంలో ఓడిపోయినా రెండో స్థానంలో నిలిచారు. నాగబాబు మాత్రం ఎంపీగా పోటీ చేసి ఏకంగా మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ ఒకటి రెండు సార్లు వచ్చి జిల్లాలో పరిస్థితిని సమీక్షించారు. కానీ, నాగబాబు మాత్రం ఇప్పటికి ఒక్క సారి కూడా వచ్చింది లేదు. ఆయన హైదరాబాద్‌కే పరిమితమయ్యారు.పవన్ కళ్యాణ్ నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ సమీక్ష జరిగినప్పుడు సైతం నాగబాబు ఇటు వైపు రాలేదు. మరోపక్క, ఏకంగా అధినేత పవన్ కళ్యాణ్ తమను పట్టించుకోకపోవడంతో కేడర్ కూడా చెల్లాచెదురవుతోంది. మెజారిటీ నాయకులు వైసీపీలో చేరుతుండగా ఒకరిద్దరు బీజేపీలోకి జంప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన నాలుగు నెలలకే జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో జనసేన ఆఫీసులు మూసేస్తున్నారు. కానీ, ఇవేవీ పట్టనట్టు.. పవన్ కళ్యాణ్ సొంత జిల్లాలో పార్టీ పతనమవుతుంటే వదిలేసి పక్క రాష్ట్రంలో పార్టీని డెవలప్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. తెలంగాణలోనూ ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. వీటిని చూస్తున్న విశ్లేషకులు.. ముందు ఇంటి దీపం చక్కబెట్టుకో.. జానీ అంటూ సూచిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్వింటాడా?! చూడాలి!