దసరా బాదుడు షురూ
హైద్రాబాద్,
పండుగలు వచ్చాయంటే రైల్వేకి కాసులే కాసులు. దసరా నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ నుంచి ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రయాణీకులు క్యూలు కడతారు. దీన్ని రైల్వేశాఖ సొమ్ము చేసుకుంటోంది. దసరా రద్దీని సాకుగా తీసుకుని ఏపీలో ప్రధాన రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరలను దక్షిణ మధ్య రైల్వే అమాంతంగా పెంచేసింది. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరను రూ. 10 నుంచి ఏకంగా రూ.30కి పెంచేసింది. విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, గుంటూరు, తిరుపతి, గుంతకల్‌లో శనివారం నుంచే పెంచిన ధరలు అమల్లోకి వచ్చేశాయి. ఏటా పండుగలు, పర్వదినాల్లో టికెట్ల ధరలు పెంచడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి మరీ ఎక్కువగా పెంచేశారు. గతంలో రూ.10 నుంచి రూ. 20కి పెంచేవారు. ఇప్పుడు ఏకంగా రూ. 30కి పెంచారు. సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో ప్లాట్‌ఫాం టికెట్ ధరలు పెంచే విషయాన్ని నేడోరేపో తేల్చనున్నారు.