బీసీ కార్డుతో బీజేపీ
నల్గొండ,
హుజూర్‌నగర్ ఉపఎన్నిక కోసం దాదాపుగా ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ఖరారు చేశాయి. టీడీపీ తమ అభ్యర్థిగా చావా కిరణ్మయి పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆదివారం బీజేపీ కూడా తమ అభ్యర్థి పేరు ప్రకటించింది. తమ అభ్యర్థిగా డాక్టర్ కోట రామారావును ఎంపిక చేసినట్లు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఓ ప్రకటనలో తెలిపారు. రామారావుతో పాటు ఎన్నారై జైపాల్ రెడ్డి పేర్లను పరిశీలించిన నడ్డా.. చివరకు రామారావు పేరును ఫైనల్ చేశారు.ప్రభుత్వ వైద్యుడైన రామారావు ఇటీవలే తన ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. హుజూర్‌నగర్ అభ్యర్థిత్వం కోసం బీజేపీ జైపాల్ రెడ్డి పేరును కూడా పరిశీలించింది. కానీ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తికే టికెట్ ఖరారు చేశాయి. దీంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన కటో రామారావుకు టికెట్ కేటాయిస్తే ఫలితం ఉంటుందనే వ్యూహంతో బీజేపీ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖాయం చేసింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య చీలితే.. బీసీల ఓట్లు తమకు పడతాయని కమలనాథులు ఆశిస్తున్నారు.హుజూర్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని గరిడేపల్లి మండలం, కేతవారిగుండం రామారావు స్వగ్రామం. కోట రంగయ్య, నరసమ్మ దంపతులకి 1978, మే 12న ఆయన జన్మించారు. రామారావు తండ్రి గ్రామ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌గా మూడుసార్లు పని చేశారు. ఒకసారి సాగునీటి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు.రామారావు కాలేజీ రోజుల్లో ఏబీవీపీ తరఫున పని చేశారు. ప్రభుత్వ డాక్టర్‌గా కొంతకాలం ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పనిచేశారు. మిలిందా గేట్స్ ఫౌండేషన్‌లో కొంతకాలం పనిచేసిన ఆయన.. హైదరాబాద్‌లో వైద్యుడిగా సేవలందించారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో మెడికల్ క్యాంపులు నిర్వహించారు.