శ్రీవారి బ్రహ్మోత్సవ మహాప్రదర్శనను ప్రారంభించిన టిటిడి ఛైర్మెన్
తిరుమల సెప్టెంబర్ 30,:
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల కల్యాణవేదికలో ఏర్పాటు చేసిన శ్రీవారి బ్రహ్మోత్సవ మహాప్రదర్శనను సోమవారం ఉదయం టిటిడి అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డితో
కలిసి టిటిడి ఛైర్మెన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఛైర్మెన్ మాట్లాడుతూ శ్రీవారి భక్తులను ఆకట్టుకునేలా మహాప్రదర్శనను ఏర్పాటు చేశారని తెలిపారు. భక్తులను ఆకర్షించేలా కల్యాణవేదికలో టిటిడి ఎస్వీ మ్యూజియం
విభాగం, ప్రజాసంబంధాల విభాగం, ఉద్యానవన శాఖ, అటవీవిభాగం, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో మహాప్రదర్శనను రూపొందించారన్నారు. అత్తి వరదరాజస్వామివారి తరహాలో
మూడు భంగిమల్లో సెట్టింగ్ ఏర్పాటు చేయడం, కంచికి వెళ్లి చూసినట్లు ఉందన్నారు. అదేవిధంగా, నాలుగు యుగాలకు సంబంధించిన పౌరాణిక ఘట్టాలతో భక్తిభావాన్ని పంచేలా
దేవతామూర్తులను రూపకల్పన చేశారని అన్నారు. బ్రహ్మోత్సవాలలో దాదాపు 40 టన్నుల పుష్పాలు, 2 లక్షల కట్ ఫ్లవర్లను వినియోగించనున్నారని తెలిపారు. ఫలపుష్పాలతో
ఏర్పాటు చేసిన ఏనుగులు, కలశాలు, గుర్రాలు, రథం తదితర ఆకృతులను తిలకించారు. ముందుగా శ్రీమహావిష్ణువు గరుడినిపై వస్తున్న విధంగా రూపొందించిన సైకత శిల్పం,
స్వామివారి చిత్రాలు, వాహనసేవలు, త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్, తిలకించారు. ప్రత్యేక పుస్తక ప్రదర్శన, సూక్ష్మ కళా చిత్ర ప్రదర్శన, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు
చేసిన జౌషధాల ప్రదర్శన, టిటిడి ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో భక్తులను ఆకర్షించేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. నాడు నేడు పేరిట తిరుమల చరిత్రను
తెలిపే ఫోటోలు, టిటిడి ఉత్సవాలు, పంచబేరాలు, అలిపిరి నుండి అఖిలాండం వరకు గల విశేషాలు, శ్రీవారి ఆలయంలోని మండపాలు, ఘాట్ రోడ్ల ఫోటోలను పరిశీలించారు.
అంతకుముందు శ్రీవరాహస్వామి అతిథి గృహం - 1 పక్కన ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
భక్తులకు అవసరమైన వైద్యసేవలు అందించాలని కోరారు.