పేదల బియ్యం గద్దల పాలు(కరీంనగర్)
కరీంనగర్, : పేదల బియ్యం గద్దల పాలవుతున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి లబ్ధిదారులకు చేరాల్సిన రూపాయికి కిలో బియ్యం దొడ్డిదారిన దళారులకు దక్కుతున్నాయి. దొడ్డు బియ్యాన్ని చౌకగా చేజిక్కించుకుంటున్న మాయగాళ్లు రాత్రికి రాత్రే హోటళ్లు, వ్యాపార సంస్థలు, పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. భారీగా చీకటి దందా సాగిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. నిద్రావస్థలో జోగుతున్న సర్కారు నిఘాతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. లబ్ధిదారుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి నాలుగు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ బియ్యం కోటా పెంచారు. 2014 నుంచి ఒక్కొక్కరికి ఆరు కిలోలు చొప్పున ఇస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకు 16,800 టన్నుల బియ్యాన్ని కేటాయిస్తున్నారు. ఇందులో కరీంనగర్ జిల్లాకు 4,890 టన్నులు, జగిత్యాలకు 5,240, పెద్దపల్లికి 3,576, సిరిసిల్ల జిల్లాకు 3,093 టన్నులు తరలుతున్నాయి. వీటి విలువ రూ.50.40 కోట్లు ఉంటుంది.
సరుకుల పంపిణీకి ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా పేదలకు దక్కాల్సిన బియ్యం పక్కదోవ పడుతూనే ఉన్నాయి. వివిధ మార్గాల్లో గుట్టుగా దళారులకు చేరుతున్నాయి. దీనికితోడు ఉమ్మడి జిల్లాలో అధికశాతం లబ్ధిదారులు రేషన్ బియ్యం తినడం లేదు. చౌకధరల దుకాణంలో రూపాయికి కిలో చొప్పున పొందుతున్న దొడ్డు బియ్యాన్ని చౌకగా అమ్ముకుంటున్నారు. దీన్ని అదునుగా తీసుకుంటున్న దళారులు కిలోకు రూ.8 నుంచి రూ.10 వరకు కొంటున్నారు. సేకరించిన బియ్యాన్ని హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలకు రూ.20 నుంచి రూ.22 వరకు విక్రయిస్తున్నారు. కొందరికి రైలుమార్గం అనువుగా ఉండడంతో బియ్యాన్ని ప్యాసింజర్ రైళ్లలో మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఏటా వేలాది క్వింటాళ్ల సరుకులను విరూర్, నాగపూర్ వ్యాపారులకు అక్రమంగా చెరవేస్తూ, కిలోకు రూ.28 నుంచి రూ.35 దాకా గిట్టుబాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో దొడ్డు బియ్యానికి డిమాండ్ నెలకొనడంతో అక్కడికి పెద్దఎత్తున రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. తక్కువ పెట్టుబడితో లాభసాటి వ్యాపారం కావడం, సర్కారు పర్యవేక్షణ పెద్దగా లేకపోవడం.. వెరసి అక్రమార్జనతో దళారుల జేబులు నిండుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈయేడు ఇప్పటి వరకు అడపా దడపా జరిగిన తనిఖీల్లో 4,583 క్వింటాళ్ల బియ్యం పట్టుబడ్డాయి. ఈ మేరకు రూ.1.37 కోట్ల విలువైన సరుకులను స్వాధీనం చేసుకున్న అధికారులు 183 కేసులు నమోదు చేశారు. దీన్ని బట్టి రేషన్ బియ్యంతో మాయగాళ్లు నడిపిస్తున్న చీకటి దందా ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. రేషన్ బియ్యం కోసం ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా ధాన్యం కొంటోంది. వాటిని మిల్లుల్లో మర పట్టించి, ఛౌకధరల దుకాణాలకు పంపుతోంది. ఈమేరకు వివిధ చార్జీలు, పన్నులు కలుపుకొని కిలో బియ్యంపై రూ.30 వరకు ఖర్చు చేస్తోంది. కాగా.. చాలామంది లబ్ధిదారులు దొడ్డు బియ్యం తినేందుకు విముఖత చూపుతున్నారు. వాటిని కిలోకు రూ.8 నుంచి రూ.10 చొప్పున అమ్ముతూ, రూ.40 లకు లభిస్తున్న సన్నబియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రేషన్ బియ్యం కొంటున్న దళారులకు కిలోపై రూ.10 నుంచి రూ.25 దాకా లాభం చేకూరుతోంది. అంటే.. పేదల కోసం సర్కారు కల్పిస్తున్న రాయితీతో దళారులకే ప్రయోజనం కలుగుతోంది.