ఇవాళ్టి నుంచి ఏపీలో సర్కారీ మందు షాపులు
విజయవాడ, సెప్టెంబర్ 30,
ఎన్నికల హామీల్లో భాగంగా జగన్ సర్కార్ మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రైవేటు మద్యం షాపుల గడువు సోమవారంతో ముగియనుంది. సెప్టెంబర్ 30తో మద్యం వ్యాపారుల లైసెన్స్ గడువు ముగుస్తుండడంతో వాటి స్థానంలో మద్యం షాపులు ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. షాపులో ఉన్న పాత సరుకునంతా విక్రయించే పనిలో వ్యాపారులు బిజీగా ఉన్నారు.అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. ఇప్పటికే అద్దె షాపులు గుర్తించిన ఎక్సైజ్ శాఖ సరుకు నింపి రేపటి నుంచి అమ్మకాలు సాగించేందుకు సన్నద్ధమవుతోంది. కొత్త మద్యం విధానం అమల్లోకి రావడంతో రాష్ట్రంలో మరో 20 శాతం షాపులు కూడా మూతపడనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4,380 మద్యం షాపులు ఉన్నాయి. వీటి గడువు నేటితో ముగిసిపోతుంది. దశలవారీ మద్యనిషేధంలో భాగంగా షాపుల సంఖ్య 20 శాతం మేర తగ్గనుంది. ఇప్పుడున్న వాటి సంఖ్యను తగ్గించి 3,448 షాపులను మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.లైసెన్స్ గడువు ముగిసిపోతుండడంతో వ్యాపారులు ముందస్తుగానే అమ్మకాలు తగ్గించేశారు. ఇప్పటికే షాపులో ఉన్న సరుకును విక్రయించే పనిలో పడ్డారు. గతంలో లైసెన్స్‌దారులు మారినా షాపులోని మద్యం కొత్తవారికి అప్పగించేవారు. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు సంబంధం లేకపోవడంతో సరుకు ఎక్సైజ్‌కు అప్పగించాల్సి ఉంటుంది. తిరిగి ఇచ్చిన సరుకుపై ఎక్సైజ్ శాఖ నగదు చెల్లింపులపై స్పష్టత లేకపోవడంతో అయినకాడికి విక్రయించేస్తున్నారు. దానికి అనుగుణంగా వ్యాపారులు కొద్దివారాల ముందు నుంచే రెగ్యులర్‌గా నడిచే బ్రాండ్లు మినహాయించి కొత్త బ్రాండ్ల ఇండెంట్లు పెట్టడం నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో మద్యం కొరత ఏర్పడినట్లు సమాచారం.ప్రైవేటు షాపుల గడువు ముగుస్తుండడంతో ప్రభుత్వ షాపుల్లో కొరత రాకుండా ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరుకు తరలించారు. షాపుల్లో పనిచేసే సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి చేశారు. వారికి శిక్షణ కూడా ఇప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు కానున్న 3,448 ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అక్కడక్కడా మినహాయించి సుమారు మూడు వేలకుపైగా షాపులు మంగళవారం రోజు ప్రారంభం అవుతాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. అయితే కొత్త విధానంలో బీర్ల విక్రయాలపై స్పష్టత కరువైంది. షాపుల్లో ఫ్రిట్జ్‌లు ఏర్పాటు చేసి కూలింగ్ బీర్లు విక్రయిస్తారా? లేక కూలింగ్ లేకుండానే విక్రయిస్తారా? అనే విషయంపై సందిగ్ధం నెలకొంది.