కోడెల సంతాప సభలో పరిటాల సునీత భావోద్వేగం
గుంటూరు, సెప్టెంబర్ 30,
ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు జగన్ సర్కారే కారణమని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల సంతాప సభలో మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన భర్త పరిటాల రవి, కోడెల మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. ఇద్దరూ అన్న ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చినవరేనన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2004లో వైఎస్ హయాంలో తన భర్త పరిటాల రవిని దారుణంగా హత్య చేశారని, ఆయనతో పాటు మా ప్రాంతంలో ఎంతోమందిని చంపేశారన్నారు. ఇప్పుడు ఆయన కొడుకు వైఎస్ జగన్ అధికాంరలోకి వచ్చాక కోడెల శివప్రసాద్‌ను ఇన్‌డైరెక్ట్‌గా చంపేశారంటూ భావోద్వేగానికి గురయ్యారు. కోడెలది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని సునీత ఆరోపించారు. అందరికీ ధైర్యం చెప్పే నాయకుడు కోడెల.. ఆయనే ఆత్మహత్య చేసుకున్నారంటే ఎన్ని ఇబ్బందులు పెట్టి ఉంటారో అర్థమవుతోందన్నారు.టీడీపీ నేతలు, కార్యకర్తలను గ్రామాల్లో ఇబ్బందులు పెడుతున్నారని, కేసులు పెట్టి వేధిస్తున్నారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సానుభూతిపరులను కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారన్నారు. ప్రభుత్వ వేధింపులతోనే కోడెల మృతి చెందారని, ఆయన మరణం పార్టీకి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. రూపాయికే వైద్యం చేసిన నాయకుడు కోడెల.. మంత్రి అయినా, స్పీకర్ అయినా డాక్టర్‌గానే గుర్తింపు పొందారన్నారు. బసవతారకం ఆస్పత్రి చూస్తే ఆయనే గుర్తొస్తారన్నారు. కోడెల కుటుంబానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు అండగా ఉండాలని కోరారు.పల్నాటి పులిగా పేరొందిన కోడెల మరణం బాధాకరమని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక కక్షసాధింపులకు పాల్పడుతోందన్నారు. ప్రభుత్వ అరాచకాలు ప్రజావేదికతో ప్రారంభమయ్యాయని, సీనియర్ నాయకుడు కోడెలను వేధింపులకు గురిచేసి ఆయన ఆత్మహత్య చేసుకునేలా చేశారన్నారు. మూడు నెలల్లోనే ఎన్ని ఇబ్బందులు పెట్టారో అర్థం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఈ ధోరణులు సరికాదు. ఆయన కుటుంబానికి అందరూ అండగా నిలవాలని కోరారు.