టీడీపీ కి దేవేందర్ గౌడ్ కొడుకు రాజీనామా
హైద్రాబాద్, సెప్టెంబర్ 30,
టీడీపీ నేత, తెలంగాణ తెలుగు యువత అధ్యక్షుడు తూళ్ల వీరేందర్ గౌడ్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సోమవారం తన రాజీనామా లేఖ పంపించారు. ఆయన త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. వీరేందర్ గౌడ్.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ కుమారుడు కావడం గమనార్హం. తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్ 2018లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఉప్పల్ నియోజకవర్గం నుంచి మహాకూటమి తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అక్టోబరు 3న ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వీరేందర్ గౌడ్ బీజేపీలో చేరనున్నారు. దేవేందర్ గౌడ్ త్వరలో బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు.