భద్రకాళీ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు
వరంగల్,
వరంగల్ మహానగరంలో పరమపావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళీ దేవస్థానంలో దేవీశరన్నవరాత్ర మహోత్సవములు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ విదియ సోమవారం తేది:30-09-2019 రోజున ఉదయం 4-00 గంటలకు అర్చకులు గుడితలుపులు తెరిచి నిర్మాల్యాపనయనము జరిపి ఆలయ శుద్ధి చేశారు.
తర్వాత సుప్రభాతసేవ నిత్యాహ్నికం యధావిధిగా నిర్వర్తించి అమ్మవారిని అన్నపూర్ణేశ్వరిగా అలంకరించి ఉదయం బ్రహ్మచారిణి క్రమంలోను, సాయంకాలం దేవజా క్రమంలో పూజారాధనలు నిర్వహించారు. వరాహ పురాణంలో నవదుర్గా క్రమాన్ని అనుసరించి అమ్మవారు సతీదేవిగా తనువు చాలించిన పిమ్మట పర్వతరాజు కుమారిగా జన్మిస్తుంది. అందుకే
ఆమెను శైలపుత్రి దుర్గ అంటారు. అట్టి దుర్గ తపస్సుకు అరణ్యానాకి వెలుతుంది. కఠోరమైన దీక్షతో శంకరుడి గూర్చి తపస్సు చేస్తుంది. అందుకు సంకేతంగా అమ్మవారిని మొదటి రోజు శైలపుత్రీదుర్గా, రెండవ రోజు బ్రహ్మచారిణి దుర్గా క్రమంలో నవరాత్రులలో ఆరాధిస్తారు. శైలపుత్రీ ఆరాధన సాధకునిలో కుండలినీ శక్తిని జాగృతం చేస్తుంది. మధుకైటభులనే రాక్షసులు
లోకకంటకులై ప్రపంచాన్ని పీడిస్తున్న సందర్భంలో విష్ణుమూర్తి నిద్రిస్తూ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి యొక్క నిద్ర తొలగిపోవడానికి యోగనిద్రా దుర్గను స్తుతిస్తాడు. బ్రహ్మచేసిన స్తుతికి యోగనిద్రా దుర్గ సంతసించి విష్ణుమూర్తి శరీరం నుండి బహిర్గతం కాగా విష్ణుమూర్తి మేల్కొని మధుకైటభులనే రాక్షసులను సంహరిస్తాడు. అందుకోసం మొదటి రోజు యోగ నిద్రా
క్రమంలో ఆరాధిస్తారు. మహిషాసురుని వల్ల పీడితులైన ఋషులంతా త్రిమూర్తుల దగ్గరికి వచ్చి మహిషాసురుని గోరకృత్యాలను దేవతలకు వివరిస్తూ మహిషాసురుడి బారి నుండి కాపాడమని ప్రార్ధించగా ఋషులు మహిషాసురుడిని దుశ్చర్యలను ఋషులు భ్రహాది దేవతలకు తెలుపుతున్న సందర్భంలో దేవతలంతా కోపోద్రిక్తులు కాగా దేవతల కోపమంతా ఒక్క
రాశిగా ఏర్పాడి అట్టి కోపం నుండి జగన్మాత ఆవిర్భవించగా దేవతలంతా ఒకొక్కరు తమతమ ఆయుధాలలో ఒక్కొక్కటి ఆ జగన్మాతకు అందజేస్తారు. ఈ రోజు పూజా కార్యక్రమాలకు హోటల్ గీతాభవన్, హన్మాకొండ అధినేతలు నాగరాజ శెట్టి ప్రభావతి శ్రీ బాలచంద్ర హోళ్ళ, శ్రీ అన్నపశెట్టి హేత దంపతులు, హైద్రబద్ వాస్తవ్యులు కసిరెడ్డి సోమిరెడ్డి కళావతి, మహేశ్వర్
రెడ్డి గీత దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ రోజు అమ్మవారికి మకర వాహన సేవ, సాయంకాలం చంద్రపభ్ర వాహన సేవలు నిర్వహించారు.