నీలోఫర్ పై త్రిసభ్య కమిటీ విచారణ
హైద్రాబాద్, సెప్టెంబర్ 30,
నీలోఫర్ హాస్పిటల్‌లో క్లినికల్ ట్రయల్స్ వ్యవహారం సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. ఇందుకోసం ప్రిన్సిపల్ సెక్రటరీ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సోమవారం నీలోఫర్ ఆసుపత్రిలో పర్యటించింది. ఎంత మంది పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ చేశారన్న కోణంలో విచారణ జరిపింది. దీనికి సంబంధించిన పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని కమిటీ తెలిపింది.డాక్టర్ రాజారావ్, డాక్టర్ నిర్మల థామస్, డాక్టర్ లక్ష్మీ కామేశ్వరితోపాటు నిలోఫర్ హాస్పిటల్ సూపరిండెంట్ మురళీ కృష్ణ విచారణలో పాల్గొన్నారు. ఫిర్యాదు చేసిన డాక్టర్ లాలూ ప్రసాద్, ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి కుమార్ కూడా విచారణలో పాల్గొన్నారు. దాదాపు మూడు గంటల పాటు విచారణ కొనసాగింది.ఎంత మంది మీద క్లినికల్ ట్రయల్స్ చేశారు..? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే దిశగా విచారణ జరిపిన కమిటీ వివరాలు సేకరించింది. తాము సేకరించిన పూర్తి వివరాలు ప్రభుతానికి అందజేస్తామని కమిటీ స్పష్టం చేసింది. క్లినికిల్ ట్రయల్స్‌లో పాల్గొన్న ఫార్మా కంపెనీల వివరాలను కూడా ప్రభుత్వానికి అందజేస్తామని కమిటీ తెలిపింది.
వందలాది మందిపై క్లినికల్ ట్రయిల్స్
నిలోఫర్‌లో వందలాది మంది పిల్లలు ఔషధ కంపెనీల క్లినికల్ ట్రయల్స్ బాధితులుగా మిగిలారు. గతేడాది మే నుంచి ఏడాది పాటు 300 మంది పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. ఇన్‌పేషెంట్లుగా వచ్చిన నవజాత శిశువులు మొదలు 14 ఏళ్లలోపు పిల్లలపైనే ఈ ప్రయోగాలు జరిగినట్లు క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ఇండియా నివేదికలో వెల్లడించింది. 300 మందిలో 100 మంది ని జనరల్ వార్డు నుంచి, మరో 100 మందిని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ) నుంచి, ఇంకో 100 మందిని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసీయూ) నుంచి ఎం పిక చేశారు. వీరిపై యాంటీ బయోటిక్స్ మందుల ప్రయోగం జరిగిందని నివేదిక తెలిపింది. పిల్లలు రోగాలతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు వారిపై యాంటీ బయోటిక్స్ ప్రయోగించారు. తద్వారా వారిపై అదెలా పనిచేసిందో వివరాలు సేకరించారు. ఔషధ సామర్థ్యాన్ని నిర్ధారణ చేశారు. ఈ కాలంలో ఇతర మందులతో పోలుస్తూ అధ్యయనాలు జరిగినట్లు తేలింది. ఇద్దరు వైద్యులు ఈ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనగా, కంపెనీల ప్రతినిధులు, ఇతరులు వారికి సహాయకులుగా ఉన్నారు. నిలోఫర్‌లో పదేళ్లుగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని నివేదిక తెలిపింది. ఈ పదే ళ్లలో 13 ట్రయల్స్ జరిగాయని, ఈ పిల్లల ఆరోగ్య పరిస్థితిపై సమాచారం లేదు. అది విచారణలోనే వెల్లడి కావాల్సి ఉంది